"ఆశా భోస్లే"కు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. వీడియో వైరల్ !!
లెజెండరీ గాయని ఆశా భోస్లే ఇటీవలే దివికేగిన విషయం తెలిసిందే. ఆమె మరణం భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతుంది. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మరణించారు. 1933లో సంగీత సంప్రదాయానికి నిలయమైన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, చిన్న వయస్సులోనే గానప్రస్థానం ప్రారంభించారు. అక్క Lata Mangeshkarతో కలిసి భారతీయ సంగీతానికి రెండు కళ్లుగా నిలిచిన ఆమె.. 1943లో తొలి పాటను రికార్డ్ చేసి సినీరంగంలో అడుగుపెట్టారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో ఆమె స్వరం మార్మోగింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో వేల సంఖ్యలో పాటలు పాడి Guinness World Recordsలో స్థానం సంపాదించారు.
కాగా ఆశా భోస్లేకు ప్రముఖ బ్రిటిష్ వర్చువల్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి అర్పించారు. ఈ బ్యాండ్ లేటెస్ట్ షోలో ఆశా భోస్లేకు ప్రత్యేక నివాళి అర్పించడంతో భారతీయ సంగీత అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. లండన్ లోని టోటెన్‌హామ్ హాట్‌స్పర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో.. ఆశా భోస్లేను గుర్తు చేస్తూ 'ది షాడోయీ లైట్' పాటను ప్రదర్చారు. ఈ సందర్భంగా వేదికపై ఆమె దృశ్యాలను ప్రదర్శించగా.. స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. అంతే కాకుండా ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే.. గొరిల్లాజ్ వ్యవస్థాపకుడు డేమన్ ఆల్బార్న్‌తో కలిసి వేదికపై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక గత ఏప్రిల్‌లో 92 ఏళ్ల వయసులో ఆశా భోస్లే కన్నుమూశారు. ఆమె సినీ ప్రస్థానం 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బాళ్'తో ప్రారంభమైంది. 1950లలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, 1952లో వచ్చిన 'సంగ్దిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం 'పరిణీత', 'బూట్ పాలిష్' వంటి చిత్రాలతో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు R. D. Burmanతో కలిసి చేసిన ప్రయోగాలు ఆమె కెరీర్‌ను కొత్త దిశలో నడిపించాయి. "పియా తూ అబ్ తో ఆజా", "యే మేరా దిల్", "ఆజా ఆజా" వంటి పాటలతో వెస్ట్రన్, క్యాబరే, క్లబ్ డ్యాన్స్ నంబర్లకు కొత్త గుర్తింపును తీసుకువచ్చింది.
"దిల్ చీజ్ క్యా హై", "మేరా కుచ్ సామాన్" వంటి పాటలకు రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గాయని అవార్డును గెలుచుకుని తన ప్రతిభను నిరూపించారు. సంగీత దర్శకుడు R. D. Burmanతో ఆమె చేసిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. "దమ్ మారో దమ్", "పియా తూ అబ్ తో ఆజా", "చురా లియా హై తుమ్నే" వంటి పాటలు తరతరాలకు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ జంట భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.












Click it and Unblock the Notifications