విజయ్-త్రిషలపై ‘చీప్’ ప్రశ్న: జర్నలిస్ట్‌కు నటి మాళవిక క్లాస్!
స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ బహిరంగ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ఇబ్బందికరమైన ప్రశ్నలకు మాళవిక స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తమిళనాడు సీఎం, నటుడు విజయ్, నటి త్రిషల మధ్య ఉన్న పుకార్లను ప్రస్తావిస్తూ ఆ జర్నలిస్ట్ మాళవికను అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు. 'విజయ్‌తో కలిసి త్రిష తరచూ పబ్లిక్ మీటింగ్స్‌లో ఎందుకు కనిపిస్తుందని.. విజయ్‌తో ప్రయాణించేటప్పుడు మీకు కూడా అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?' అంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాళవిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ క్రమంలో మాళవిక మొదట అసౌకర్యంగా నవ్వుతూ.. మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ సున్నితంగానే మందలించే ప్రయత్నం చేసింది.
సంయమనంతో సమాధానం చెప్పిన మాళవిక
అయినప్పటికీ ఆ జర్నలిస్ట్ అక్కడితో ఆగకుండా సినిమా గాసిప్స్ జోకులు కలుపుతూ.. ఒక్కసారిగా రాజకీయం వైపు మళ్లాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాత్ర ఎలా ఉంది? ఆయన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పాలంటూ మాళవికను డిమాండ్ చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో మాళవిక కాసేపు విస్మయానికి గురైనప్పటికీ.. చాలా సంయమనంతో సమాధానం ఇచ్చింది. విజయ్ ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభించారని.. ఇప్పుడే విజయ్ ప్రభుత్వంపై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేనని చాలా హుందాగా చెప్పింది. విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని, ఆయనకు ఆల్ ది బెస్ట్ అని పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా మాళవిక చాలా ఓపికగా, ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేసిందని నెటిజన్లు మాళవికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో విజయ్-త్రిషల వ్యక్తిగత విషయాలను లాగుతూ జర్నలిస్ట్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ వివాదం మరింత ముదరడంతో స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ స్వయంగా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ ఓ క్లారిఫికేషన్ పోస్ట్ పెట్టింది.
అందులో ఆమె రాస్తూ.. "నేను నిన్న ఒక ఈవెంట్‌కు వెళ్లాను. తమిళనాడు మీడియా, జర్నలిస్టుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ వారిలో ఒకరిద్దరు మాత్రం కావాలనే చాలా అసహ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలను అడిగి సంచలనం సృష్టించడానికి ప్రయత్నించారు. దళపతి విజయ్ నాకు గత ఏడేళ్లుగా తెలుసు. ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది, ఆయన్ను నా స్నేహితుడిగా పిలుచుకోవడానికి గర్వపడుతున్నాను. ఓ నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రయాణాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లోనైనా అందరి గౌరవ మర్యాదలను కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు" అంటూ మాళవిక స్పష్టం చేసింది.
— itzSekar (@SekarItz) May 16, 2026
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను వారి పని గురించి అడగకుండా కేవలం క్లిక్ బైట్ కోసం, మీమ్స్ కోసం ఇలాంటి వ్యక్తిగత గాసిప్స్ అడగడం ఈ మధ్య ఎక్కువైపోయింది. సినిమా గాసిప్స్‌ను, రాజకీయాలను కలిపి అడగడం అనే సదరు జర్నలిస్టుల అపరిపక్వతను, కేవలం వైరల్ సౌండ్ బైట్ల కోసం వారు పడుతున్న ఆరాటాన్ని చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications