ఐషూ చల్లా మెస్మరైజ్- మన ఆలూ బోండాకు యూఎస్ మాస్టర్ చెఫ్ లో పట్టం
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటల పోటీ షో మాస్టర్ చెఫ్ యూఎస్ఏ వేదికపై మన ఆలూ బోండా సత్తా చాటింది. ఈ ఏడాది మే లో జరిగిన సీజన్ 16 గ్లోబల్ గాंట్లెట్ లో దీనికి పట్టం కట్టారు. భారతీయ సంతతికి చెందిన ఐషు చల్లా దీన్ని అమెరికన్లకు పరిచయం చేశారు దీన్ని. తాను తయారు చేసిన ఆలూ బోండాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తన అసాధారణమైన పాకశాస్త్ర నైపుణ్యంతో ఆమె ఏకంగా ఇమ్యూనిటీ పిన్‌ను సొంతం చేసుకుని తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు.
ఈ అంతర్జాతీయ వంటల పోటీల్లో ఆసియా-పసిఫిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు ఐషు చల్లా. ప్రతి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా తినే ఆలూ బోండాను గ్లోబల్ వేదిక ప్రదర్శించారు. షో నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు ఈ వంటకాన్ని సవరీ డోనట్ గా అభివర్ణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాకాహార భారతీయ వంటకాల్లోని వైవిధ్యాన్ని, మసాలాల మేళవింపును ఆమె ఈ సాంప్రదాయ వంటకం ద్వారా విదేశీయులకు ఆకట్టుకునేలా వివరించారు.

ఐషు తయారు చేసిన ఈ ఆలూ బోండాలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీలకర్ర, ఇతర మసాలాలను కూర్చారు. అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని నింపారు. శనగపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఈ బోండాను కొబ్బరి పచ్చడి, పుదీనా కొత్తిమీర పచ్చడితో జ్యూరీ సభ్యులకు వడ్డించారు. విదేశీయుల నోటికి రుచిగా అనిపించేలా.. దేశీయ రుచి ఎక్కడా కోల్పోకుండా ఆమె దీనిని సిద్ధం చేయడం విశేషం.
ఆలూబోండా రంగు, రుచి, ఆకృతిపై జ్యూరీ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. బోండా ఆకర్షణీయమైన బంగారు రంగులో మెరుస్తూ, నూనె ఎక్కువగా పీల్చకుండా, తేలికగా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. లోపలి బంగాళాదుంప మసాలా, పచ్చడి రుచులు అద్భుతంగా కుదరడంతో ఈ వంటకం మాస్టర్ చెఫ్ యూఎస్ఏ చరిత్రలోనే అత్యుత్తమ రుచుల్లో ఒకటిగా నిలిచిందని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు.
అంతర్జాతీయ వేదికలపై మన స్ట్రీట్ ఫుడ్స్ కు పెరుగుతున్న ఆదరణను ఈ విజయం మరోసారి స్పష్టం చేసింది. స్థానిక రుచులను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో ఐషు చల్లా సాధించిన విజయం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జూలైలో ప్రారంభం కాబోయే తదుపరి రౌండ్లలో ఆమె మరిన్ని దేశీయ రుచులను పరిచయం చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ లైవ్ టెలికాస్ట్ కారణంగా ఈ రియాలిటీ షో ప్రసారానికి కొన్ని వారాల పాటు విరామం ప్రకటించారు. సరికొత్త ఎపిసోడ్‌లతో ఈ పోటీలు తిరిగి ఈ నెల 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. వీటిని ఫాక్స్ ఛానెల్ టెలికాస్ట్ చేయనుంది.












Click it and Unblock the Notifications