ఈ సినిమాకు రేటింగా..?
తెలుగు తెరపై కొన్నేళ్లుగా 'లాజిక్ లెస్ కామెడీ' ట్రెండ్ నడుస్తోంది. ముగ్గురు, నలుగురు స్నేహితులు, అర్థం లేని కథాంశాలు, కానీ నవ్వుల సునామీ! ఈ ఫార్ములాలో వచ్చిన మరో చిత్రం 'మిత్ర మండలి'. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించడంతో అంచనాలు పెరిగాయి. మరి 'కథలేని కథ' అని ముందే హింట్ ఇచ్చిన ఈ సినిమా... ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించగలిగింది? రివ్యూలో చూద్దాం.
కథ
జంగ్లీ పట్నంలో కులాన్ని ప్రాణంగా భావించే పెద్ద మనిషి నారాయణ (వీటివి గణేష్) ఎమ్మెల్యే కావాలని కలలు కంటాడు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఆయన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంట్లోంచి పారిపోతుంది. కులపు ఓట్లు పోతాయనే భయంతో నారాయణ... కూతురు కిడ్నాప్ అయిందని నాటకం ఆడుతాడు. ఈ కిడ్నాప్ డ్రామా మధ్యలో చైతన్య (ప్రియదర్శి) గ్యాంగ్ (రాగమయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా) ఇరుక్కుంటుంది. అసలు స్వేచ్ఛకు ఈ చిల్లర గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? వీరి మధ్యలో ఎలాంటి లాజిక్ లేని ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఎందుకు వచ్చింది? అనేది మిగిలిన కథ.

కథనం
దర్శకుడు విజయేందర్ టైటిల్ కార్డ్స్‌లోనే "కథ లేని కథ" అని నిజాయితీగా చెప్పేశాడు. అంటే... జస్ట్ కూర్చోండి, 'మిత్ర మండలి' చేసే చిల్లర పనులకు నవ్వుకోండి అంతే! అని సింపుల్ హింట్ ఇచ్చారు.కానీ, కథ లేకుండా నవ్వించడం అనేది ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ 'జాతి రత్నాలు' వంటి కొద్దిపాటి సినిమాలకే సాధ్యమైంది. దురదృష్టవశాత్తు, ఆ లిస్టులో చేరడానికి 'మిత్ర మండలి' తీవ్రంగా ప్రయత్నించినా చేరలేకపోయింది.సినిమాలో కామెడీ కోసం సీన్లను బలవంతంగా ఇరికించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా వరకు 'సోది' అనిపించే సన్నివేశాలతో సాగింది. అయితే, సెకండాఫ్‌లో అక్కడక్కడా ఫన్ జనరేట్ అయింది.
సత్య.. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్
లాజిక్‌తో పనిలేని ఈ సినిమాలో, లాజిక్ లేని క్యారెక్టర్‌తో వచ్చి నవ్వించింది మాత్రం సత్యే! సత్య ఉన్న ప్రతి సీన్ బాగా పండింది. వెన్నెల కిషోర్‌తో అతని కాంబో సీన్లు థియేటర్‌లో కాసేపు నవ్వులు పూయించాయి. 'మిత్ర మండలి'ని కాసేపు ఎంజాయ్ చేయవచ్చంటే, అది సత్య మరియు వెన్నెల కిషోర్ పుణ్యమే.
కథనంలో లాజిక్స్ మిస్ అయినా, దర్శకుడు కులాలపై పంచులను, సామాజిక సెటైర్లను అక్కడక్కడా బాగానే పేల్చాడు. ముఖ్యంగా గణేష్ పోషించిన నారాయణ పాత్ర, 'సామజవరగమనా' సినిమాలోని కుల శేఖర్ క్యారెక్టర్‌ను గుర్తుకు తెస్తుంది.
నటీనటుల ప్రదర్శన: ప్రియదర్శి మిస్ ఫైర్
సత్య క్యారెక్టర్‌కు లాజిక్ లేకపోయినా, తనదైన టైమింగ్‌తో కామెడీని అదిరిపోయేలా పండించాడు.ప్రియదర్శి అతని కామెడీ టైమింగ్‌ను దర్శకుడు పూర్తిగా వాడుకోలేకపోయాడు. అక్కడక్కడా నవ్వించినా, పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు.వీటివి గణేష్ నారాయణ పాత్రలో బాగా ఒదిగిపోయాడు.నిహారిక తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.అనుదీప్ కె.వి: ఒక్క సీన్‌లో కనిపించినా నవ్వించి వెళ్లిపోయాడు.
టెక్నికల్ టీం
కామెడీ చిత్రాలకు సంగీతంతో పెద్దగా పని ఉండదు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం పర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌లో ఫస్టాఫ్‌ను మరింత పదును పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు
ఓవరాల్‌గా చెప్పాలంటే, 'మిత్ర మండలి' కథ లేకుండా కామెడీ చేయాలని ప్రయత్నించింది కానీ, సత్య క్యారెక్టర్ మినహా ఆ ప్రయత్నం చాలా వరకు విఫలమైంది. కామెడీని ఎంజాయ్ చేయాలంటే... మీరు చాలా కష్టపడాలి.












Click it and Unblock the Notifications