SAIF ALI KHAN CASE: నిందితుడు అతను కాదా..?
బాలీవుడు స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ కస్టడీని ముంబయిలోని బాద్రాకోర్టు పొడిగించింది. ఈనెల 29 వరకూ నిందితుడి కస్టడీని పొడిగిస్తూ బాద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీసీటీవీల్లో నమోదైన దృశ్యాలు, అరెస్టయిన వ్యక్తి దృశ్యాలు ఒకటేనా? కాదా? అని నిర్థారించాల్సి ఉందని దానికోసం ఫేషియల్ రికగ్నిషన్ టెస్టు చేస్తామన్నారు. అందుకే కస్టడీని పొడిగించాలని కోర్టును కోరారు పోలీసులు. పోలీసుల వాదనలు విన్న కోర్టు.. ఈనెల 29 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అతను నా కొడుకు కాదు..
అయితే షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ తండ్రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి తన కొడుకు కాదన్నారు. సీసీటీవీలో నమోదైన వ్యక్తి.. తన కుమారుడు ఒకే పోలికలతో ఉండడం వల్లనే తన కుమారుడిని అక్రమంగా ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించాడు. ఈ క్రమంలో షెహజాద్ కు ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి పోలీసులు కోర్టు అనుమతి కోరారు.

పోలీసులు ఇప్పటివరకూ చేసిన దర్యాప్తు, ఆధారాలను నివేదిక రూపంలో కోర్టు ముందు ఉంచారు. కోర్టు ముందు పోలీసులు వాదనలు వినిపించారు. "సైఫ్ నివాసంలోని ఫూట్ ప్రింట్స్.. నిందితుడి ఫూట్ ప్రింట్స్ ఒకేలా ఉన్నాయా, లేదా అనేది మేం నిర్ధరణ చేసుకోవాల్సి ఉంది. నిందితుడి వస్త్రాలను, సైఫ్ పై దాడి చేసిన సమయంలో వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం. అయితే ఘటనా సమయంలో షెహజాద్ ధరించిన షూను ఇంకా రికవరీ చేయలేదు. అలాగే దాడికి ఉపయోగించిన కత్తిలోని మిగతా భాగాన్ని రికవర్ చేయాల్సి ఉంది. నిందితుడు విచారణలో మాకు సహకరించడం లేదు" అని కోర్టుకు పోలీసులు వివరించారు. షెహజాద్ వద్ద బంగ్లాదేశీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని.. విజయ్ దాస్ పేరుతో భారత్‌లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేసుకున్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు.
నిందితుడి తరఫు న్యాయవాదుల వాదన
అయితే పోలీసుల వాదనతో నిందితుడి తరఫు న్యాయవాదులు దినేశ్ ప్రజాపతి, సందీప్ షేర్ కహ్నే విభేదించారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల్లో ఉన్న వ్యక్తికి.. షెహజాద్ కు ఎలాంటి పోలికలు లేవు. అలాంటి సమయంలో అతడ్ని ఎలా అరెస్ట్ చేస్తారు. కావాలనే షెహజాద్ ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు షెహజాద్ వద్ద నుంచి ఫింగర్ ప్రింట్స్, స్టేట్ మెంట్స్ రికార్డు చేశారు. ఇది అంతర్జాతీయ లేదా తీవ్రవాదుల కుట్ర కావొచ్చు. ఆ కోనంలో పోలీసులు ఎందుకు విచారణ చేపట్టడం లేదు. అని కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇరువురి తరఫున వాదనలు విన్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.సి.రాజ్‌పుత్, నిందితుడి పోలీసు కస్టడీ గడువును జనవరి 29 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
జరిగింది ఇదే..
జనవరి 16న తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ చొరబడ్డాడు. తనను పట్టుకోబోయిన సైఫ్‌పై అతడు కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అపార్ట్‌మెంట్ నుంచి దుండగుడు పారిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు జనవరి 19న నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications