బాలయ్య-నాగార్జున కాంబోలో సినిమా రాకుండా ‘మాట’ అడ్డం వేసిన జూనియర్ ఎన్టీఆర్!
నందమూరి బాలకృష్ణ తండ్రి నందమూరి తారకరామారావు, అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో గుండమ్మకథ, మిస్సమ్మ, మాయాబజార్ లాంటి క్లాసికల్ మల్టీస్టారర్లు వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఈ సినిమాలు అలా నిలిచిపోతాయి. వీరిద్దరి తనయులు మాత్రం ఇంతవరకు కలిసి నటించలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బాలయ్యతో సినిమా ఎందుకు చేయలేదో కారణం చెప్పారు. బాలకృష్ణ తనకు హిందీలో సూపర్ హిట్ అయిన చుప్ కే చుప్ కే సినిమా సీడీ పంపించారని, అది చూసిన తర్వాత ఆ సినిమాను తెలుగులో ఇద్దరం కలిసి చేద్దామన్నారు.
తారక్ అలా కోరడంతో ఇది ఆగిపోయింది
హిందీలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించారు. దీంతో తాను కూడా సీడీ చూసి సినిమా చేద్దామని నిర్ణయించుకొని ఓకే చెప్పానన్నారు. అయితే ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫోన్ చేశాడని, బాబాయ్.. నేను, నాగచైతన్య కలిసి గుండమ్మ కథ సినిమాను చేద్దామనుకుంటున్నామని, మీరు-బాలయ్య కలిసి మల్టీస్టారర్ చేస్తే ఆ ప్రభావం తమ సినిమాపై పడుతుందని, మీ ఆలోచన మానుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు. తారక్ అలా కోరడంతో తాను, బాలయ్య చేయాల్సిన మల్టీస్టారర్ ఆగిపోయిందని నాగార్జున చెప్పారు.

దానిజోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది
మొదటి నుంచి తాను, బాలయ్య కలిసి గుండమ్మ కథ చేయాలనే ప్రతిపాదన ఉందని, కానీ అటువంటి క్లాసిక్ ను పట్టుకోకుండా అలా వదిలివేయడమే మంచిదనే ఉద్దేశంతో ఆ సినిమా జోలికి వెళ్లలేదన్నారు. అయితే బాలయ్య-నాగార్జున మల్టీస్టారర్ కు అడ్డుకట్ట వేసిన తారక్ తర్వాత నాగచైతన్యతో గుండమ్మకథ సినిమాను చేయలేదు. అది ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది. అటు అది తెరకెక్కలేదు.. ఇటు ఇది తెరకెక్కలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. నాగార్జునకు, బాలయ్యకు విభేదాలున్నాయి. అవి చల్లారేలా కనిపించడంలేదు. అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా చూడటానికి బాలయ్య వెళ్లనంతగా వీరిమధ్య విభేదాలు ముదిరిపోయాయి. దీంతో భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశమే కనిపించడంలేదు.












Click it and Unblock the Notifications