బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. "అఖండ 2" రిలీజ్‌కి లైన్ క్లియర్ !!
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ "అఖండ 2". ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం.. అంతా అనుకున్నట్టు జరిగుంటే.. ఈరోజు ( డిసెంబర్ 5, 2025 ) రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉండేది. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనాన్షియల్ వివాదాల కారణంగా మద్రాస్ హైకోర్టు మూవీ రిలీజ్‌పై తాత్కాలిక నిషేధం విధించడంతో నిర్మాతలకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అంటున్నారు.
అసలేం జరిగిందంటే..?
'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే.. 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయని అంటున్నారు. డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. డిసెంబర్ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచోట్ల పడనున్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈరోజు ( డిసెంబర్ 9, 2025 ) మద్రాసు హైకోర్టులో ఈ కేసు వ్యవహారంపై తీర్పు వెలువడనుంది. ఆ తర్వాత నిర్మాతల నుంచి అధికరికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఈ చిత్రం వాయిదా పడడంతో చిన్న చిత్రాలన్ని డిసెంబర్ 12న దండయాత్రకు సిద్దమయ్యాయి. మరి ఆ చిత్రాల పరిస్థితి ఏంటో అని కూడా జోరుగా చర్చ జరుగుతుంది.
కాగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications