ఈ శూన్యాన్ని ప్రపంచంలో ఇంకేది భర్తీ చేయలేదు.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకోని రీతిలో తారకరత్న ఈ లోకాన్ని వీడడం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఈరోజు తారకరత్న రెండో వర్దంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈ మేరకు ఆ పోస్టులో.. నువ్వు వెళ్లిపోతూ మిగిల్చిన ఈ శూన్యాన్ని ఈ ప్రపంచంలో ఇంకేది భర్తీ చేయలేదు. నిన్ను ఈ విధి మా నుంచి దూరం చేసింది. ఈ గాయాన్ని ఈ కాలం కూడా మాన్పలేదు. బద్దలైన గుండె మళ్లీ అతకలేదు. మనం ఇలా విడిపోకుండా ఉండాల్సింది. నువ్వు మాతో ఉండకపోవచ్చు కానీ.. నీ ప్రభావం మా జీవితాల మీద ఉంటుంది.. మా కలలో నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు.. నువ్వు లేని ఈ బాధను నేను మాటల్లో చెప్పలేను.. మిస్ యూ.. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సైతం సాడ్ ఎమోజీస్ రిప్లై గా పెడుతున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన మధు సూదన్‌రెడ్డి కుమార్తె అలేఖ్య. అలానే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి.. భార్య చెల్లెలి కుమార్తె గా అత్యంత దగ్గరి బంధువులు. తారకరత్న హీరోగా నటించిన 'నందీశ్వర' సినిమాకు అలేఖ్యరెడ్డి కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబీకులు ఆమోదించలేదు. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. అయితే ఫిబ్రవరి 18న ఆయన తుదిశ్వాస విడిచాడు.
2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారక రత్న టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత విలన్ గా 'అమరావతి' చిత్రంలో నటించగా నంది అవార్డు అందుకున్నారు.












Click it and Unblock the Notifications