రామ్ చరణ్ కు 70.. ఎన్టీఆర్ కు 50
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వారినుంచి తర్వాత రాబోయే చిత్రాల థియేట్రికల్ హక్కుల కోసం పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే చరణ్-శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంకు నార్త్ లో రూ.70 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ చేస్తున్న దేవర చిత్రానికి రూ.50 కోట్లు పలికింది. ఈ రెండు సినిమాల రైట్స్ తీసుకుంది ఒక్కరే.. అతనే అనిల్ తడాని.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ గ్లోబల్ హీరోగా మారిపోయారు. ఆ సినిమాలో తను కనపరిచిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు రావడంతో తన తర్వాత సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది విజయ దశమికి విడుదల చేయబోతున్నారు. జాన్వీకపూర్ కథానాయిక కాగా అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించడంలో ఆలస్యం జరగకుండా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ ఐదోతేదీనే విడుదలయ్యేది.

దిల్ రాజు రామ్ చరణ్-శంకర్ కాంబోలో సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత శంకర్ అకస్మాత్తుగా కమల్ హాసన్ ఇండియాన్ 2 షూటింగ్ లో పాల్గొని దాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై దృష్టి పెట్టారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ రూపుదిద్దుకుంటోందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది. స్క్రిప్ట్ ను సిద్ధం చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications