'పుష్ప2'ను తట్టుకొని సంచలన రికార్డ్ నెలకొల్పిన 'దేవర'
యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి 2024లో వచ్చిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తో ఈ సినిమాను హిట్ గా నిలబెట్టి రూ.550 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగారు. జాన్వీకపూర్ తొలిసారిగా తెలుగు తెరకు ఈ సినిమా ద్వారానే పరిచయమైంది. సినిమా విజయంలో అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీలకపాత్ర పోషించింది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరులు నటించారు.
ఆరు కేంద్రాల్లో 100 రోజులు
ఈ సినిమా తాజాగా మరో రికార్డును కైవసం చేసుకుంది. గతేడాది సెప్టెంబరు 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ఆరు కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలోని పద్మజ కాంప్లెక్స్ లో, మండపేటలోని రాజరత్న కాంప్లెక్స్ లో, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో, చిత్తూరు జిల్లా బి. కొత్త కోటలోని ద్వారకా పిక్చర్స్ ప్యాలెస్‌లో, కల్లూర్‌లో ఎంఎన్‌ఆర్‌లో, రొంపిచెర్లలో ఎంఎం డీలక్స్ లో దేవర సినిమా విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. కంటిన్యూ ఆటతో మరో రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అంతకుముందు 52 కేంద్రాల్లో 50 రోజులు దేవర ఆడింది.

పుష్ప2 సునామీని తట్టుకొని మరీ
సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ వందరోజులు పూర్తిచేసుకోవడం ఒక విశేషమైతే, పుష్ప2 సునామీని తట్టుకొని కూడా ఇన్నిరోజులు ఆడటం నిజంగా విశేషమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. పుష్ప2 విడుదలైన సమయంలో దాదాపుగా అన్ని థియేటర్లలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ప్రదర్శించారు. అయినా ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా దేవరనే ఆడించారు. అభిమానులకు తారక్ పై ఉన్న అభిమానం దీనిద్వారా రుజువవుతోందంటున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాప్రసారమవుతోంది. ఇందులో కూడా కొత్త రికార్డును నెలకొల్పింది. నాన్ ఇంగ్లిషు సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సినిమాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. జులైలో ఈ సినిమాకు సంబంధించిన రెండోభాగం స్క్రిప్ట్ పనులు పూర్తిచేసి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications