ఓ సుకుమారి రివ్యూ : పెళ్లాన్ని ముట్టుకుంటే షాకే.. ఆ భర్త తిప్పలు చూడాల్సిందే !
తెలుగు ప్రేక్షకులకు మెప్పించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కథలు వస్తూనే ఉంటాయి. అలాంటి విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఓ సుకుమారి'. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో భారీ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్.. పరేషాన్, ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తిరవీర్ ఈ మూవీలో జంటగా నటించారు. భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ సినిమా "ఒంట్లో కరెంట్ ఉన్న అమ్మాయి" కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది మీకోస ప్రత్యేకంగా..
సినిమా కథ..
మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లా ధూమ్‌పల్లి గ్రామానికి తన తండ్రితో కలిసి వస్తుంది సుకుమారి అలియాస్ దామిని (ఐశ్వర్య రాజేష్). పుట్టుకతోనే ఆమెకు అరుదైన సమస్య ఉంటుంది. గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి విద్యుత్ ప్రవహించి ఎదురుగా ఉన్నవారికి షాక్ కొడుతుంది. ఈ కారణంగా చిన్నప్పటి నుంచే ఆమె సాధారణ జీవితం గడపలేకపోతుంది. తల్లి ప్రేమకు దూరమవుతుంది. గ్రామంలోనూ ఆమెను చూసి అందరూ భయపడుతుంటారు.

అలాంటి సమయంలో తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు అమాయక యువకుడు యాదగిరి (తిరువీర్). దామినికి ఉన్న సమస్యను దాచిపెట్టి గ్రామ పెద్దలు ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత దామిని రహస్యం బయటపడుతుంది. నిజం తెలిసిన తర్వాత యాదగిరి ఎలా స్పందించాడు? ప్రేమను వదిలేశాడా? లేక భార్యకు అండగా నిలిచాడా? ఆమె శరీరంలోకి కరెంట్ రావడానికి అసలు కారణం ఏమిటి? చివరికి ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? అన్నదే మిగతా కథ.
మూవీ విశ్లేషణ..
సాధారణ ప్రేమకథల మధ్య పూర్తిగా కొత్త ఆలోచనతో దర్శకుడు భరత్ దర్శన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. "ఒంట్లో కరెంట్ ఉండే అమ్మాయి" అనే పాయింట్ వినగానే ఆసక్తి కలుగుతుంది. ఇదే సినిమా ప్రధాన బలం కూడా. సినిమా ప్రారంభంలోనే హీరోయిన్ పరిస్థితిని, ఆమె ఎదుర్కొన్న ఒంటరితనాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. గ్రామీణ వాతావరణం, అమాయకమైన పాత్రలు కథలో సహజత్వాన్ని తీసుకొస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేమ, కామెడీ, కుటుంబ సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. ముఖ్యంగా యాదగిరి-దామిని మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులతో పాటు చిన్నచిన్న భావోద్వేగాలను కూడా పంచుతాయి. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. హీరోయిన్ సమస్య వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకునే ప్రయత్నాలు, కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ కోసం హీరో చేసే పోరాటం కథను ముందుకు తీసుకెళ్తాయి.
అయితే దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్‌కు ఉన్న స్కోప్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడనే భావన కలుగుతుంది. హీరోయిన్ తాకితే షాక్ కొట్టే అంశం చుట్టూ మరింత వినోదాన్ని, మరింత థ్రిల్లింగ్ సన్నివేశాలను సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిమితంగానే వినియోగించాడు. కొన్ని చోట్ల కథ కాస్త నెమ్మదిస్తుంది. కొన్ని సన్నివేశాలు రిపీట్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఎడిటింగ్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత షార్ప్‌గా ఉండేది. అయినా క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన ఎమోషనల్ టచ్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సమస్యను కేవలం సైన్స్‌తో కాకుండా తల్లి ప్రేమ, కుటుంబ అనుబంధంతో ముడిపెట్టిన తీరు హృదయానికి హత్తుకుంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒక సంతృప్తి కలిగించే ముగింపు ఈ సినిమాకు పెద్ద ప్లస్.
నటీనటుల పనితీరు..
ఐశ్వర్య రాజేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో సినిమాను భుజాలపై మోసింది. అమాయకత్వం, బాధ, ప్రేమ, భయం, ఒంటరితనం... ప్రతి భావాన్ని సహజంగా పలికించింది. ముఖ్యంగా కళ్లతోనే భావాలను వ్యక్తపరిచిన తీరు ప్రశంసనీయం.
తిరువీర్ తన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అమాయక గ్రామీణ యువకుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. హీరోయిన్‌తో వచ్చే రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.
మురళీధర్ గౌడ్, ఆమని, ఝాన్సీ, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి, అంజి మామ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కామెడీ ట్రాక్‌లో వీరి నటన ప్రేక్షకులను అలరిస్తుంది.
సాంకేతిక విభాగం..
దర్శకుడు భరత్ దర్శన్ తీసుకున్న కాన్సెప్ట్ ప్రశంసించదగ్గది. కథలో కొత్తదనం ఉంది. అయితే స్క్రీన్‌ప్లేను మరింత బలంగా రాసి ఉంటే సినిమా మరోస్థాయికి వెళ్లేది.
సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు అందించిన నేపథ్య సంగీతం కథకు బాగా ఉపయోగపడింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి.
కుషేందర్ సినిమాటోగ్రఫీ సినిమా విజువల్ క్వాలిటీని పెంచింది. గ్రామీణ అందాలను సహజంగా తెరపై చూపించారు. ఫ్రేములు అందంగా ఉన్నాయి.
ఎడిటింగ్ పరంగా కొంత కత్తిరించే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
బలాలు..
కొత్త కాన్సెప్ట్
ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటన
తిరువీర్ సహజమైన పెర్ఫార్మెన్స్
గ్రామీణ నేపథ్యంలో వచ్చే కామెడీ
ఇంటర్వెల్ ట్విస్ట్
భావోద్వేగ క్లైమాక్స్
బలహీనతలు..
కాన్సెప్ట్‌కు తగ్గ స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడం
కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం
సెకండాఫ్‌లో రిపీట్ సన్నివేశాలు
కొంత ప్రెడిక్టబుల్ డ్రామా
రేటింగ్: 2.5/5













Click it and Unblock the Notifications