OM Movie Review: ఓం రివ్యూ.. మమ్ముట్టి కూడా కాపాడలేకపోయాడా?
టైటిల్: ఓం
నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్, చైతు జొన్నలగడ్డ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: ఎజిల్ అరసు కె
ఎడిటింగ్: ఆర్.కలైవానన్
నిర్మాతలు: శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మాగ్
దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి
స్టోరీ
చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరకట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమిస్తుంది.ఈ ఆపరేషన్‌కు నిత్యా రెడ్డి(సాయిపల్లవి) నాయకత్వం వహిస్తుంది. దేశీయంగా స్మగ్లింగ్ నెట్వర్క్‌ను నడిపిస్తున్న కార్తికేయన్ అలియాస్ సియా(మమ్ముట్టి)ని పట్టుకునేందుకు ఆమె ఓ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా పళని(ధనుష్) అనే పోలీస్ అధికారిని రహస్యంగా సియా గ్యాంగ్ లోకి అండర్ కవర్ ఆఫీసర్‌గా పంపుతుంది. నేరస్థుల సమాచారం సేకరించే క్రమంలో పళనికి ఎదురైన సవాళ్లేంటి? చివరకు స్మగ్లింగ్ ముఠాను ఎలా పట్టుకున్నారు? అన్నదే 'ఓం' కథ.

నటీనటులు ఎవరెలా నటించారంటే?
అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పళని పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించారు. వృత్తిరీత్యా ఇంట్లో ఎదురయ్యే సమస్యలు, గ్యాంగ్‌లో ఉంటూ పడే సంఘర్షణను తన నటనతో చక్కగా పండించారు. పవర్ఫుల్ పోలీసు అధికారిగా సాయి పల్లవి ఆకట్టుకుంది. శ్రీలీల తన పరిమిత నిడివిలో హీరోను అనుమానించే సీన్లలో నవ్వులు పూయించింది. అయితే మమ్ముట్టి వంటి దిగ్గజ నటుడి పాత్రలో ఆశించిన స్థాయిలో పవర్, ఇంటెన్సిటీ లేకపోవడం పెద్ద మైనస్. గ్రే షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ.. ఆయన విలనిజం అంతగా భయపెట్టదు. చైతు జొన్నలగడ్డ తన పాత్రకు న్యాయం చేయగా.. రేణు దేశాయ్ పాత్ర కొద్ది సేపటి తర్వాత ప్రాధాన్యత కోల్పోయింది.
విశ్లేషణ
అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్టాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. పాత్ర పరిచయం, డీటైలింగ్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ధనుష్ 10 నిమిషాల సింగిల్-షాట్ ఇంట్రోసీక్వెన్స్ సినిమాకు హైలైట్.ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ వేగం పూర్తిగా తగ్గిపోయింది. కథ ముందుకు కదలకుండా ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇందులో చూపించిన ఎమోషన్ ధనుష్ గత చిత్రాలను తలపించడమే కాకుండా పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. సెకండాఫ్‌లో వచ్చే వీర సాంగ్, అడవిలో జరిగే ఫైట్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ.. మిగిలిన సీన్లు సాదాసీదాగా, ఊహకు అందేలా సాగుతాయి. సాయి పల్లవి నేరస్థులను పెద్దగా కష్టపడకుండానే పట్టుకోవడం వల్ల థ్రిల్ మిస్ అయింది. ట్రైలర్లోనే కథంతా చెప్పేయడంతో కొత్తదనం లోపించింది. జైలు ఫైట్ సీన్ కూడా పేలవంగా ఉంది. కమర్షియల్ అంశాలు, మమ్ముట్టి పాత్రకు మరింత బలమైన రాత ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
సాంకేతిక విభాగం
సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెరపై వీర పాట ఆకట్టుకుంటుంది. అయితే సౌండ్ మిక్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది, కొన్ని చోట్లు పాటల లిరిక్స్ స్పష్టంగా వినిపించవు. ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ధనుష్ ఇంట్రో, ఫారెస్ట్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే నిడివి ఎక్కువైనట్లు అనిపిస్తుంది, సెకండాఫ్‌కు మరింత కత్తెర వేయాల్సింది.
బలాలు:
*ధనుష్, సాయి పల్లవి నటన
*ఆకట్టుకునే ఫస్టాఫ్, 10 నిమిషాల సింగిల్ షాట్ ఇంట్రో
*ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్, సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
నిరాశపరిచే, నెమ్మదించిన సెకండాఫ్
*మమ్ముట్టి పాత్రలో పవర్ లేకపోవడం
*ఊహించదగిన కథనం, సాగదీత
ఫైనల్‌గా..
భారీ అంచనాలతో వచ్చిన 'ఓం' కేవలం అక్కడక్కడా మాత్రమే మెప్పిస్తుంది. ఆసక్తికరమైన ఫస్టాఫ్ తర్వాత, సెకండాఫ్‌ను మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. కేవలం ధనుష్ నటన, కొన్ని యాక్షన్ ఘట్టాల కోసం ఒకసారి చూడదగ్గ సాధారణ సినిమా ఇది!
రేటింగ్: 2.75/5.













Click it and Unblock the Notifications
