6 ఏళ్ల తర్వాత ఓటీటీని షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్!
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. విభిన్న కథాంశాలు, బలమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. సరిగ్గా ఇదే కోవలో వచ్చి, ఆరేళ్లయినా ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. అదే 'ఇని ఉత్తరం'.
కథా నేపథ్యం
జానకి అనే వైద్యురాలు ఒకరోజు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. తాను ఒక హత్య చేశానని అధికారులకు చెబుతుంది. అయితే ఆమె మాటలను పోలీసులు తేలికగా తీసుకుంటారు. ప్రజలకు, మీడియాకు సమాధానం చెప్పలేక, ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జానకి తన వాదనపై గట్టిగా నిలబడుతుంది. తాను హత్య చేసిన మృతదేహాలను పాతిపెట్టిన ప్రాంతాన్ని స్వయంగా చూపిస్తానని పట్టుపడుతుంది. పోలీసులు, మీడియా ప్రతినిధులతో కలిసి ఆమె అడవిలోకి వెళ్లగా, స్థానికులు కూడా భారీగా తరలివస్తారు. అక్కడ తవ్వి చూడగా నిజంగానే రెండు శవాలు బయటపడతాయి. దీంతో సాధారణంగా సాగే పరిస్థితి ఒక్కసారిగా మారి, కేసు తీవ్రత పెరుగుతుంది.

ఇన్‌వెస్టిగేషన్‌లో కీలక మలుపులు
శవాలు బయటపడిన తర్వాత జానకి చెప్పిన నిజాలు విచారణ దిశను పూర్తిగా మార్చేస్తాయి. ఆ ఇద్దరిని తాను హత్య చేయలేదని, ఒక పోలీసు అధికారే ఆ హత్యలకు పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేస్తుంది. తన ఆరోపణలను రుజువు చేయడానికి బలమైన ఆధారాలను కూడా సమర్పిస్తుంది. ఈ పరిణామంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతారు. ఎస్పీ స్వయంగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టి విచారణను వేగవంతం చేస్తారు. ఈ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ హత్యల వెనుక ఒక రాష్ట్ర మంత్రి హస్తం ఉన్నట్లు బయటపడుతుంది. అసలు ఆ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారికి జానకితో ఉన్న సంబంధం ఏమిటి? జానకి చేసిన ఆరోపణలలోని నిజమెంత? పోలీసు అధికారిని ఆమె ఎందుకు దోషిగా నిలబెట్టింది? ఈ కుట్రలో రాజకీయ నాయకుడి పాత్ర ఏమిటి? చివరికి అసలైన హంతకులను ఎలా శిక్షించారు? అనే రసవత్తర ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అసలు కథ.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టాలెంటెడ్ నటి అపర్ణా బాలమురళి ఇందులో ప్రధాన పాత్ర పోషించి అద్భుతమైన నటన కనబరిచారు. సుధీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళాభవన్ షాజోన్, హరీష్ ఉత్తమన్, సిద్ధిక్, చందునాథ్ జి. నాయర్, జాఫర్ ఇడుక్కి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. 'ఖుషి', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలతో మధురమైన పాటలు అందించిన హేశామ్ అబ్దుల్ వహాబ్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మొదటి నిమిషం నుండి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు చక్కటి విజువల్ ట్రీట్ ఇస్తుంది.














Click it and Unblock the Notifications
