పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఏంచేసేవారో తెలుసా?
ప్రస్తుత రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా సంచలనంగా మారారు. పిఠాపురం నుంచి 70వేల పైచిలుకు మెజారిటీతో తాను స్వయంగా గెలుపొందడమే కాకుండా జనసేన పోటీచేసిన అన్నిస్థానాల్లో ఎక్కడా ఓటమిపాలు కాకుండా వ్యూహం రచించి అందులో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా జనసేనానిని తుఫాను అంటూ అభివర్ణించారు.
సినిమాలే పునాది
రాజకీయపార్టీ స్థాపించడానికి సినిమాల్లో దక్కిన ఆదరణద్వారా దాన్ని పునాది చేసుకున్నారు పవన్. కానీ సినిమాల్లోకి కూడా రాకముందు ఏం చేసేవారంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం పవన్ కు కరాటే నేర్పిన గురువు చేసిన వ్యాఖ్యలు కూడా వైరలవుతున్నాయి. మాస్టర్ షెహాని హుస్సేన్ వద్ద పవన్ కరాటే నేర్చుకున్నారు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో 1990లో జరిగిన సంఘటనలను ఆయన తెలిపారు. ఒక వ్యక్తి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అంటే దానివెనక ఎంతో పట్టుదల, కృషి ఉంటుందని, అందుకు ఉదాహరణగా తన శిష్యుడు పవన్ కల్యాణ్ నిలిచారన్నారు.

గదులు శుభ్రం చేసేవాడు
1990లో తాను కరాటే నేర్పడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీని నడపడంలో ఎంతో బిజీగా ఉండేవాడిని అన్నారు. అదే సమయంలో పవన్ వచ్చి కరాటే నేర్పమని అడిగాడంటూ తెలిపారు. అయితే తాను బిజీగా ఉండటంవల్ల కుదరదని చెప్పానని, అయినా పవన్ కల్యాణ్ మాత్రం అక్కడే ఉండి నేర్పించాలంటూ పట్టుబట్టారు.ఇలా ఏడాది సమయం తమదగ్గరే ఉండేవాడని, ఒక సామాన్యమైన వ్యక్తిలా గడిపేవాడని, చిరంజీవి తమ్ముణ్ని అనే అహం కొంచెంకూడా ఉండేది కాదని హుస్సేన్ తెలిపారు. తమకు టీకప్పులు కూడా తీసుకొచ్చేవాడని, గదులు కూడా శుభ్రం చేసేవాడంటూ పవన్ గొప్పతనం గురించి హుస్సేన్ చెప్పారు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏ పనిలోనైనా పట్టుదల కృషి ఉంటేనే ఉన్నత స్థాయిలో ఉంటారని పవన్ కళ్యాణ్ నిరూపించారు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు












Click it and Unblock the Notifications