రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా టికెట్ల రేట్ల పెంపు, రాజకీయ అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై..
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో నెగెటివ్ ప్రచారం జరుగుతోందన్నారు. సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని.. దాని వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి 18 శాతం ఆదాయం వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పారు. టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ సప్లై ఆధారంగా ఉంటుందన్నారు. బ్లాక్‌లో టికెట్లు కొంటే ఆ డబ్బు వేరే వాళ్లకు వెళుతుందని.. అదే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జీస్టీ రూపంలో ఆదాయం వస్తుందన్నారు.

తన సినిమాలకు టికెట్ ధరలుపెంచలేదన్నారు. గత ప్రభుత్వం బీమ్లానాయక్ సినిమా టికెట్ ధరలు పెంచకపోగా.. తగ్గించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి సినీనటులు అందరూ మద్దతు తెలపలేదు. అయినప్పటికీ తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటి ప్రభుత్వానికి ఇష్టం లేదనిపవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
హీరోలతో నమస్కారాల పెట్టించుకునేవాళ్లం కాదు..
సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడలని పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాలు తీసే వాళ్లతోనే తాము మాట్లాడుతామని, సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటి? అని ప్రశ్నించారు. నిర్మాతలు రావాలి లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలన్నారు. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కిందిస్థాయి వ్యక్తులం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యాన్ని తాము కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తోటి నటులను గౌరవించేవారన్నారు.
సినీ పరిశ్రమపై తమ కూటమి ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన ఎప్పుడూ సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూనే ఉన్నారని పవన్ తెలిపారు. నిజ జీవితంలో జరగని సంఘనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయన్నారు. సినిమా మంచి, చెడు రెండింటినీ చూపిస్తుందనీ.. ఏది తీసుకోవాలో ప్రేక్షకుల ఇష్టమన్నారు. మంచి తీసుకుంటే బాగుపడతారన్నారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు.

రామ్‌చరణ్ మా బంగారం
హీరో రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేతత్వం రామ్‌చరణ్‌ది అని అన్నారు పవన్ కళ్యాణ్. రామ్‌చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి ఆంజనేయుడు. ఎంత ఎదిగినా, శక్తిమంతుడైనా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని తన తండ్రి రామ్‌చరణ్ పేరు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నయ్య చిరంజీవి తనకు తండ్రి లాంటివారని, చరణ్ తనకు తమ్ముడి లాంటివాడన్నారు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడినని అన్నారు.
ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రామ్‌చరణ్ బంగారమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏడేళ్ల వయస్సులోనే రామ్‌చరణ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడని పవన్ చెప్పారు. ఇంత ప్రతిభ, సమర్థత ఉందని, ఎవరికీ తెలియదన్నారు. సుకుమార్ తీసిని రంగస్థలంలో రామ్‌చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా రావాలన్నారు. గోదావరి జిల్లాల ప్రభావం అసలే లేని చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడన్నారు. చిరంజీవి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడని అన్నారు పవన్. చిరంజీవి సినిమా తొలినాళ్లలో ఎంత కష్టపడ్డారని అన్నారు. ఇప్పటిలా సేఫ్టీ సౌకర్యాలు లేకపోవడంతో తరచూ గాయపడేవారన్నారు.
నేటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీలో మీకు గొప్ప ధైర్యం ఉంది. తలచుకుంటే మెగాస్టార్ చిరంజీవిలా మీరు మీకు నచ్చిన రంగంలో సాధించగలరు. చిరంజీవి ఇచ్చిన ఊతం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన కుటుంబం ఏ హిరో సినిమా పోవాలని కోరుకోదని అన్నారు. ఇటీవల కాలంలో పబ్లిక్ ఫంక్షన్స్ పెట్టాలంటే చాలా ఒత్తిడి ఉంటోందన్నారు. కానీ, సినిమా అందరికీ తెలియాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులంతా క్షేమంగా ఇంటికి చేరాలన్నారు. ఎవరికైనా దెబ్బతగిలినా.. తన గుండెకు గాయమవుతుందని పవన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications