టీవీ నటి సంచిత ఆత్మహత్య
టెలివిజన్ రంగంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై వసై ప్ల్రాంతంలో గల స్వగృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న వయసులోనే ఆమె ఇలాంటి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం టెలివిజన్ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో సంచిత ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం, రాత్రి నుంచీ తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నార. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు సంచిత.

తల్లిదండ్రులు, చెల్లితో కలిసి నివసిస్తున్నారామె. శనివారం ఆమె తల్లిదండ్రులు తమ స్వస్థలానికి వెళ్లారు. చెల్లెలి ఇక్కడే ఉంటోన్నారు. ఆమె కూడా బయటకు వెళ్లిన తరుణంలో సంచిత బలవన్మరణానికి పాల్పడ్డారు. సంచిత ఉగలే బుల్లితెరతో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ హిందీ డైలీ ధారావాహిక కుంకుమ భాగ్యతో గుర్తింపు పొందారు.
ఎంతో ప్రజాదరణ పొందిన వాగ్లే కీ దునియా, వంటి సీరియళ్లలో ఆమె అద్భుతమైన పాత్రలను పోషించి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. సీరియళ్లకే పరిమితం కాలేదామె. లేటెస్ట్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేతో పాటు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించి 'ఛావా' చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలను పోషించారు.
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు కొన్ని గంటల ముందే సంచిత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్‌ను సైతం షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె చాలా సంతోషంగా, డాన్స్ చేస్తూ, ఉత్సాహంగా కనిపించారు. అంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే వార్త వినాల్సి రావడం ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
గత ఏడాది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో సంచిత స్పందించారు. ఆత్మహత్య చేసుకోవడం సరికాదనీ వ్యాఖ్యానించారు. యువత బలహీన మానసిక స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి మనస్తత్వం ఉన్న సంచిత ఉగలే, ఇప్పుడు తానే స్వయంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం పరిశ్రమ వర్గాలను కలచివేస్తోంది.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని రకాల కోణాల నుండి దర్యాప్తును ముమ్మరం చేపట్టారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకకపోవడంతో బలవన్మరణానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications