ప్రభాస్ వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు - ఫిష్ వెంకట్ (వీడియో)
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలు సినీ వర్గాలను కలచివేశాయి. ఆయన రెండు కిడ్నీలు పనిచేయక డయాలసిస్ చికిత్స పొందుతున్నారని, అత్యవసరంగా కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయనకు ఆర్థిక సాయం అందించారని, ఆపరేషన్ ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్ కుటుంబం తాజాగా ఒక వీడియో ద్వారా స్పష్టం చేసింది. తమకు ప్రభాస్ నుండి గానీ, ఆయన బృందం నుండి గానీ ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని, అసలు ఫోన్ కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ పీఏ అంటూ ఓ వ్యక్తి కాల్ చేశారని, కానీ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఫిష్ వెంకట్ చికిత్సకు భారీగా ఖర్చవుతుందని, దాతలు, సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభాస్ సాయం వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోవడంతో, తెలుగు సినీ పరిశ్రమలోని ఇతర పెద్దలు, దాతలు ఫిష్ వెంకట్ ఆరోగ్యానికి అండగా నిలవాలని అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు. 'ఆది', 'అదుర్స్', 'గబ్బర్ సింగ్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్‌కు ఇప్పుడు నిజమైన సహాయం అవసరమని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications