కన్నడంలో సంచలనం సృష్టిస్తున్న మూవీ.. ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణి వసంత్
కన్నడ చిత్రసీమలో ప్రస్తుతం ఓ చిన్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన 'ప్రేమద ఊరలి' చిత్రం 10 రోజుల్లోనే ఏకంగా రూ.16 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోరులో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా మీడియాతో పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాకి సంబంధించి ఒక గోల్డెన్ ఛాన్స్‌ను ఎలా కోల్పోయారనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రుక్మిణి వసంత్ కోసం దర్శకుడి తీవ్ర ప్రయత్నం
ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రుక్మిణి వసంత్ నటనకు డైరెక్టర్ మనోజ్ కుమార్ పెద్ద ఫ్యాన్ అట. అందుకే 'ప్రేమద ఊరలి' చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఆమెను ఎలాగైనా తీసుకోవాలని ఆయన గట్టిగానే ప్రయత్నించారట. చిత్రబృందం నేరుగా ఆమెను సంప్రదించినప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం, అప్పట్లో ఆమె చేతిలో ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కుదరలేదు. మరోవైపు ఇది చిన్న బడ్జెట్ సినిమా కావడంతో ఆ కాల్‌షీట్ల సమస్యల వల్ల ఆమెను ఈ సినిమాలోకి తీసుకురావడం సాధ్యం కాలేదని మనోజ్ కుమార్ వెల్లడించారు.

సినిమాలో నటించకపోయినా.. ఆమె పేరే ప్రాణం!
రుక్మిణి వసంత్ స్వయంగా తెరపై కనిపించకపోయినా, ఆమె పేరును మాత్రం ఆ చిత్ర యూనిట్ వదులుకోలేకపోయింది. దర్శకుడు మనోజ్ కుమార్‌కు 'రుక్మిణి వసంత్' అనే పేరు ఎంతగా నచ్చిందంటే.. సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు ఏకంగా 'రుక్మిణి', 'వసంత' అనే పేర్లే పెట్టేశారు. ఇందులో 'వసంత' అనేది కేవలం పాత్ర పేరు మాత్రమే కాకుండా, సినిమాలో ప్రకృతిని, భావోద్వేగాలను సూచించేలా ఎంతో అర్థవంతంగా ఆ పేరును డిజైన్ చేసుకున్నారట.
ముందు ఆ పేరుతోనే టైటిల్ అనుకున్నారట!
ఇందులో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే.. మొదట ఈ సినిమాకు 'ప్రేమద ఊరలి' అనే టైటిల్ పెట్టకముందు ఏకంగా 'రుక్మిణి వసంత' అనే పేరే పరిశీలనలో ఉందట. ఆ తర్వాత కథాంశానికి తగినట్లుగా టైటిల్ మార్చినప్పటికీ, ఆమె పేరు మాత్రం చిత్రంతో అలా బలంగా ముడిపడిపోయింది. ఇలా రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటించకపోయినా, ఆమె క్రేజ్, పేరు మాత్రం సినిమా ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ మూవీ కన్నడనాట సృష్టిస్తున్న సంచలన విజయం చూశాక.. ఒకవేళ రుక్మిణి గనుక ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఇంకెంత హైప్ వచ్చేదో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు!














Click it and Unblock the Notifications
