మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ
టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రియదర్శి, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా సంచలనం "సుయోధన" సినిమా. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత రెట్టింపు చేసింది.ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా "సుయోధన"
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది ఒక పక్కా సైకలాజికల్ థ్రిల్లర్ అని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఒక వ్యక్తికి 'సుయోధన' అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఆ పేరు వెనుక ఉన్న మర్మం ఏంటి? అనే అంశాల చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సాయికుమార్, ప్రియదర్శిల నటన. "ప్రియదర్శి నాకు బిడ్డలాంటివాడు, ఈ జనరేషన్ నటులతో పనిచేయడం సంతోషంగా ఉంది" అని సాయికుమార్ తన ఆప్యాయతను చాటుకోగా.. "50 ఏళ్లుగా పరిశ్రమకు సేవ చేస్తున్న సాయికుమార్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను" అంటూ ప్రియదర్శి తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని టీజర్ ద్వారా తెలుస్తోంది. దర్శక నిర్మాతలతో పాటు ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ ఈ సినిమా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. "స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులో ఉన్న కొత్త పాయింట్ నన్ను కట్టిపడేసింది. ఈ కథకు సాయికుమార్ గారైతేనే బాగుంటుందని మేమంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం" అని ప్రియదర్శి వెల్లడించారు. తొలి సినిమానే అయినప్పటికీ డైరెక్టర్ మాధవ్ రెడ్డి ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రొడ్యూసర్ బోసుబాబు పేర్కొన్నారు.
నటీనటుల సందడి
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ద్రిషిక చందర్ మాట్లాడుతూ.. సంహిత పాత్రలో నటించడం ఒక గొప్ప అనుభవం అని చెప్పారు. సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. దేవిప్రసాద్ వంటి నటులు ఉండటం సినిమాకు అదనపు బలం. జై క్రిష్ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. మొత్తానికి సుయోధన చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉందనేది స్పష్టమవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.












Click it and Unblock the Notifications