'పుష్ప2' చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలి?
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నుంచి రాబోతున్న చిత్రం పుష్ప2. నిర్మాత, దర్శకుడు, హీరో.. ఈ ముగ్గురికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ చిత్రాన్ని డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. బిజినెస్ కూడా దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ లో భారీగా జరిగింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనివ్వాలంటే మల్టీప్లెక్స్ ల్లో, థియేటర్లలో టికెట్ ధరలు ఇప్పుడున్నవే కాకుండా, ప్రభుత్వం పెంచుకోవడానికి అనుమతిస్తున్నవి కూడా సరిపోవు. దీంతో నిర్మాతలు మరింత భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాయబోతున్నారు.
నైజాంలో టికెట్ రూ.500
నైజాంలో మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర రూ.500, సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ ధర రూ.300 పెట్టాలని మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోంది. ఏపీలో వారికి అనుకూలమైన ప్రభుత్వం ఉండటంతోపాటు ఓ మంత్రి కూడా వారి వ్యాపారంలో భాగస్వామి కావడంతో అనకున్నరీతిలో అనుమతులొస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలో వస్తాయా? రావా? అనే విషయంలో స్పష్టతలేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విన్నవించాలని నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ధరలతో మల్టీప్లెక్స్ లకు, థియేటర్లకు ఒంటరిగా అయినా, కుటుంబాలతో కలిసి వెళ్లాలన్నా ఆస్తులు అమ్ముకోవాలని బన్నీ అభిమానులే అంటున్నారు.

హిందీలో రూ.100 కోట్లు
నైజాంలో పుష్ప2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.75 కోట్లు రాబట్టాలి. రాయలసీమలో నష్టం వచ్చినా తిరిగిచ్చే పనిలేకుండా రూ.30 కోట్లకు అమ్మారు. ఏపీలోని బయ్యర్లతో రూ.40 కోట్ల వ్యాపారం చేశారు. ఇంత భారీ ధరలకు సినిమాను అమ్మారు కాబట్టి ఇప్పుడున్న ధరలతో వాటిని రాబట్టాలంటే సాధ్యమయ్యేపనికాదు. సినీ పరిశ్రమకు ఏది కోరితే అది చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అలా అని నిర్మాతలు అడిగినంత ధరలకు అనుమతిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిర్మాతల ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా తొలిరోజే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీలో ఇప్పటికే థియేటర్లన్నీ బుక్కయ్యాయి. అక్కడ తొలిరోజు రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications