డబ్బుల కోసం జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసుకున్న ‘ఢీ 10’ విన్నర్ రాజు
తెలుగు టెలివిజన్ చరిత్రలో 'ఢీ' డ్యాన్స్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ వేదికపై అడుగుపెట్టడమే ఓ సవాల్ అనుకుంటే.. అక్కడ టైటిల్ గెలవడం అంతకంటే పెద్ద సాహసం. అలాంటిది 'ఢీ 10' సీజన్‌లో తిరుగులేని ప్రతిభతో విన్నర్‌గా నిలిచి, భవిష్యత్తుపై అంతులేని కలలు కన్నాడు డ్యాన్సర్ రాజు. ఢీ స్టేజ్ మీద రాజుతో పోటీ పడి గెలవడమంటే మాటలు కాదనే రేంజ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్తుందనుకున్న ఆ సువర్ణ సమయంలో.. అతన్ని చూసి అభిమానులు గర్వపడే బదులు, ఇప్పుడు విస్తుపోయేలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తెరవెనక ఏం జరిగింది?
అసలు తెరవెనుక ఏం జరిగింది? ఆ గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటంటే.. మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఈ వివాసానికి కేంద్రబిందువుగా మారింది. అదే భవనంలోని ఆరో అంతస్తులో ఓ యువతి బొటిక్ నిర్వహిస్తుండగా, మూడో అంతస్తులో ఉన్న చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియోకి రాజు ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అలా మొదలైన రాకపోకలు, పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య గాఢమైన సాన్నిహిత్యానికి దారితీశాయి. సినిమాల్లో పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు తిరుగులేని నమ్మకం కలిగించాడు రాజు. ఆ మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి తన సర్వస్వాన్ని అతనికి అంకితం చేసింది.

విడతలవారీగా రూ.12 లక్షలు
ఈ బంధం సాగుతున్న తరుణంలోనే అసలు ఆట మొదలైంది. రాజు వ్యక్తిగత అవసరాల కోసం, వివిధ ప్రాజెక్టుల పేరుతో ఆ యువతి నుంచి విడతలవారీగా ఏకంగా రూ.12 లక్షల వరకు ఫోన్ పే ద్వారా నగదు తీసుకున్నట్లు తేలింది. తీరా రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి మాట ఎత్తడం మానేశాడు. దీంతో ఆమె నిలదీయగా.. మొదట తన చెల్లి పెళ్లి అయ్యేవరకు కుదరదని కథలు చెప్పాడు. ఆ తర్వాత ఏకంగా తనకు భారీగా అప్పులు ఉన్నాయని, అవి తీరేంతవరకు పెళ్లి చేసుకోలేనంటూ మొండికేశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆ యువతి, న్యాయం కోసం నేరుగా మియాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయింది.
బీఎన్ఎస్ కింద కేసులు
బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. రాజుపై భారతీయన్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 (తప్పుడు హామీలు లేదా మోసపూరిత పద్ధతులతో లైంగిక సంబంధం), సెక్షన్ 318(4) (మోసం చేయడం) కింద సీరియస్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. ఈ సంచలన అరెస్ట్‌కు సంబంధించిన విషయాలను పోలీసులు కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచడం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది.
మండిపడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చేతినిండా సంపాదన, మంచి భవిష్యత్తు ఉన్న సమయాన కేవలం పదేళ్లు పెద్దదైన మహిళతో అసాధారణ బంధం పెట్టుకోవడం, ఆమె నుంచి ఆర్థికంగా సాయం తీసుకుని చివరికి నట్టేట ముంచడం ఏమాత్రం క్షమించరాని నేరమని అభిప్రాయపడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అనైతిక పోకడలు ఒక ప్రతిభావంతుడి జీవితాన్ని క్షణాల్లో ఎలా తునాతునకలు చేశాయో చెప్పడానికి రాజు ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ కేసులో ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి!














Click it and Unblock the Notifications
