రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. ‘ఇరుముడి’ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?
మాస్ మహారాజా రవితేజా హీరోగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టింది. స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలిరోజే భారీ కలెక్షన్లు సాధించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ.14.80 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి రవితేజ కెరీర్లోనే సరికొత్త రికార్డు నమోదు చేసింది.
శాక్నిల్క్ నివేదిక ప్రకారం.. 'ఇరుముడి' సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శించబడగా.. తొలిరోజే 76.9శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇండియాలో ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.17.20 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ముగిసేసరికి 'ఇరుముడి' సినిమా ఏకంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

'ఇరుముడి' సినిమా వసూళ్లలో తెలుగు వెర్షన్ అత్యంత కీలక పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో 2,591 షోల ద్వారా రూ.14.78 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. 79 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. రాత్రి ప్రదర్శించబడిన షోలలో ఏకంగా 88.08 శాతం ఆక్యుపెన్సీ లభించడం విశేషం. ప్రాంతాలవారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి రూ.15 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటకలో రూ.1.50 కోట్లు, తమిళనాడులో రూ.34 లక్షలు వసూలయ్యాయి.
ఈ సినిమాలో రవితేజ 'త్రినాథ్' అనే అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో, మద్యం అలవాటు ఉన్న తండ్రిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన కూతురు మణికంఠ(బేబీ నక్షత్ర)తో ఉన్న భావోద్వేగ బంధం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది. మరోవైపు సాయికుమార్ నటన కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు సమాజానికి అవసరమైన ఓ మంచి సందేశాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎంతో చక్కగా తెరకెక్కించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజు వచ్చిన పాజిటివ్ టాక్, వసూళ్లను చూస్తుంటే.. వీకెండ్ లో 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications