భారతదేశ సినీ చరిత్రలో ప్రభాస్ అదిరిపోయే రికార్డ్
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఇందులో పాలుపంచుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం దిశగా సినిమా దూసుకుపోతోంది. మొదటి రోజు రూ.191.5 కోట్లు వసూలు చేయగా రెండోరోజు రూ.107 కోట్లు వసూలు చేసింది. రెండురోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి సంచలన రికార్డును నెలకొల్పింది.
ఐదు సినిమాలు డార్లింగ్‌వే
ఈ సినిమాతో వరుసగా ఐదు సినిమాలతో మొదటిరోజు కలెక్షన్లు రూ.100 కోట్లు రాబట్టిన అరుదైన హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును స్థాపించారు. బాహుబలి2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కితో కలిపి ఈ రికార్డును నెలకొల్పాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు పరాజయం పాలైనప్పటికీ కలెక్షన్లలో మాత్రం ఆహా అనిపించాయి. ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించాయి. బాహుబలి2 సినిమా మొదటిరోజు రూ.217 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన సాహో తొలిరోజు రూ.130కోట్లు, ఆదిపురుష్ తొలిరోజు రూ.127.50 కోట్లు, సలార్ రూ.158 కోట్లు రాబట్టగా తాజాగా విడుదలైన కల్కి మొదటిరోజు రూ.191.5 కోట్లు వసూలు చేసింది.

ఎంత రాబడుతుందనే ఉత్కంఠ
దేశవ్యాప్తంగా మొదటిరోజు రూ.100 కోట్లు వసూలు చేసిన చిత్రాలు 11 కాగా వాటిల్లో ప్రభాస్ సినిమాలే ఐదు వరకు ఉన్నాయి. రాధేశ్యామ్ చిత్రం కలెక్షన్ల పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఆ చిత్రం మొదటిరోజు రూ.130 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రభాస్ చిత్రాలే ఆరు ఉన్నట్లు అవుతాయి. భవిష్యత్తులో ఏ హీరో కూడా ఈ రికార్డును అందుకోలేరని, అనితర సాధ్యమైన రికార్డులను తమ హీరో నెలకొల్పుతున్నాడని డార్లింగ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో కల్కి చిత్రం మరెన్ని రికార్డులను నెలకొల్పనుందో చూడాలి. రూ.వెయ్యి కోట్లు రాబడుతుందా? రూ.1500 కోట్లు రాబడుతుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications