విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. క్షమించమంటూ పోస్ట్
టాలీవుడ్ హీరోలలో యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ యంగ్ హీరో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన 'రెట్రో' సినిమాప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండించే సందర్భంలో విజయ్ మాట్లాడుతూ.. పాతకాలంలో గిరిజన తెగలు ఎలా పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నాయో ఇప్పుడూ ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య అలాగే జరుగుతోందని వ్యాఖ్యానించడంతో సమస్య మొదలైంది.
దాంతో ఈ వ్యాఖ్యలు ఆదివాసీల మనోభావాలను గాయపరిచాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్‌తో పాటు పలు గిరిజన సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఆదివాసీలకు సహజవనరుల పరిరక్షణలో కీలక పాత్ర ఉంది. వారి చరిత్ర, సంస్కృతి, సామాజిక విలువలు గొప్పవని గుర్తించకుండా, తెగల మధ్య జరిగిన సంఘర్షణలను దేశాల మధ్య యుద్ధాలతో పోల్చడం అనాగరికతగా చూపించే ప్రయత్నంగా అభివర్ణించారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలపై వివక్ష, అవమానం జరిగితే గట్టిగా శిక్షలు విధించేందుకు వీలుంటుంది. పోలీసులు కేసును నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా వేదికలపై గిరిజన సమాజం పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అయితే తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. ''పురాతన కాలాల్లో కొన్ని తెగల మధ్య జరిగిన సంఘర్షణలని ఉద్దేశించి వచ్చిన మాటలని.. షెడ్యూల్డ్ ట్రైబ్‌లను ఉద్దేశించి తాను మాట్లాడలేదని తెలిపారు.
మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జెర్సీ వంటి న్యాచురల్ క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ గత చిత్రాలు లైగర్, ఖుషి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ షార్ట్ హెయిర్, రఫ్ బియర్డ్ లుక్‌తో ఓ ఊరమాస్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు మంచి స్పందన లభించింది.












Click it and Unblock the Notifications