మన శంకర వరప్రసాద్ గారుకు అనూహ్యంగా వైసీపీ నేత నుంచి బిగ్ సపోర్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ.. మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ రాత్రి నుంచే ఈ సినిమా సందడి నెలకొనబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ప్రత్యేక ప్రీమియర్లు, టికెట్ రేట్లను పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీసైతం చేశాయి.
ఈ ధరల పెంపు, ప్రత్యేక షోలు ఏపీ, తెలంగాణల్లో వారం రోజుల పాటు అమలులో ఉంటాయి. తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. ఏపీలో కొంత తక్కువే. ఇక్కడ ఒక్కో ప్రీమియర్ షో టికెట్ 500 రూపాయలుగా నిర్ధారించారు. తెలంగాణలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో 227 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 395 రూపాయలు. ఏపీలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో 247 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 302 రూపాయలు వసూలు చేస్తారు.

విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రత్యేకించి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోవడం వల్ల మినిమమ్ గ్యారంటీ అనే టాక్ తెచ్చుకుంది. గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు ఫ్లాప్ లేని స్టార్ దర్శకుడిగా చిత్రసీమలో పేరు తెచ్చుకున్నాడు.
సినిమా విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెరమీదికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు. చిరంజీవిని తన అభిమాన నటుడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఓ ట్వీట్ పెట్టారు అంబటి. గతంలో చిరంజీవితో కలిసి దిగిన ఓ ఫొటోను ఈ ట్వీట్ కు జత చేశారు.












Click it and Unblock the Notifications