విజయ్, ధనుష్ బాటలో మరో స్టార్? తమిళనాట కొత్త పొలిటికల్ ట్విస్ట్!
తమిళ స్టార్ హీరో ధనుష్ బాటలోనే మరో స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలో అక్టోబర్ 4న శివకార్తికేయన్ ఫ్యాన్ క్లబ్ నిర్వాహకుల సమావేశం అత్యంత భారీ స్థాయిలో జరిగింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న జిల్లా, నగర, యూనియన్ స్థాయి ప్రతినిధులు సహా దాదాపు రెండు వేల మంది అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన వారందరూ తెల్లటి దుస్తులు ధరించడంతో ఇది అచ్చం రాజకీయ పార్టీ సభను తలపించింది. ఈ సమావేశంలో శివకార్తికేయన్ మాట్లాడిన మాటలు రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తాను సెల్ఫ్ మేడ్ కాదని.. ప్రజలు తనను ఎదిగేలా చేశారని 'పీపుల్ మేడ్' స్టార్ అని ఆయన అన్నారు. 2012లో తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనతో పాటు విజయ్ సేతుపతి మాత్రమే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన వాళ్లమని చెప్పారు. అప్పట్లో ఒక టెలివిజన్ యాంకర్ హీరో ఎలా అవుతాడనే ప్రశ్నలు ఎదురైనప్పటికీ.. ప్రజలు మాత్రం తనను ఆదరించారని గుర్తు చేసుకున్నారు.

ఈ సమావేశంలో ఆయన రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల పేర్లను ప్రస్తావించడం గమనార్హం. రతన్ టాటా, మదర్ థెరిస్సా, విప్లవ నేత ఎంజీఆర్, విప్లవ కళాకారుడు విజయకాంత్ వంటి వారు చేసిన మంచి పనుల వల్లే ఇతరుల సహాయం ఆశించకుండా నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన కొనియాడారు. తాము ఎవరికీ పోటీగా, ఎవరినీ ఎదిరించేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
తమిళనాడులో ఇటీవల ప్రముఖ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టడం, కొద్ది రోజుల క్రితం ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శివకార్తికేయన్ కూడా తన అభిమానులను ఒక్క తాటిపైకి తెచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం, భవిష్యత్తులో రాజకీయ అడుగుల కోసం ఆయన కూడా క్షేత్రస్థాయిలో పునాది వేసుకుంటున్నారనే చర్చకు తెరలేపింది. అయితే దీనిపై శివకార్తికేయన్ నుంచి ఎలాంటి స్పష్టమైన రాజకీయ ప్రకటన రాలేదు.













Click it and Unblock the Notifications
