OTT లోకి బ్లైండ్ లవ్ స్టోరీ, శ్రీ చిదంబరం గారు వచ్చేస్తున్నారు
మలయాళ సినిమాల్లో కనిపించే క్లాసిక్ టచ్, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన స్వచ్ఛమైన తెలుగు చిత్రం 'శ్రీ చిదంబరం గారు'. వైకల్యం అనేది శరీరానికే కానీ ఆలోచనలకి కాదని నిరూపించే ఒక అందమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్' (ETV Win) లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కథా నేపథ్యం:
ఈ సినిమా ప్రయాణం సోలమన్ (వంశీ తుమ్మల) చుట్టూ తిరుగుతుంది. సోలమన్‌కు చిన్నప్పటి నుంచి ఒక తీరని బాధ.. అది తనకున్న 'మెల్లకన్ను'. ఆ లోపం కారణంగా అందరూ తనని ఎగతాళి చేస్తూ, అసలు పేరు పక్కన పెట్టి 'చిదంబరం' అని పిలుస్తుంటారు. ఆ మెల్లకన్నే తన జీవితానికి శాపమని భావించే సోలమన్, దానిని ఎవరికీ కనబడకుండా నల్లజోడు వెనుక దాచేస్తూ, ఆత్మన్యూనతతో బతుకుతుంటాడు.
లోపం ఎక్కడ అడ్డు వస్తుందోనని..
తండ్రి మరణం తర్వాత చదువు మానేసి, కూలీ పని చేస్తూ తండ్రి చేసిన అప్పులు తీరుస్తూ బాధ్యతగల కొడుకుగా మెలుగుతుంటాడు. అదే ఊరికి చెందిన లీల (సంధ్యా వశిష్ఠ) అంటే సోలమన్‌కు ప్రాణం. కానీ తన లోపం ఎక్కడ అడ్డు వస్తుందోనని తన మనసులోని ప్రేమని చెప్పడానికి భయపడతాడు. చివరకు ఒకరోజు ధైర్యం చేసి ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు, లీల ఇచ్చే సమాధానం సోలమన్ జీవితాన్నే మలుపు తిప్పుతుంది. "ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో.. నీ లోపాన్ని కళ్లద్దాల వెనుక దాచుకోకుండా ధైర్యంగా ప్రపంచానికి చూపించు" అని ఆమె హితవు పలుకుతుంది.
ప్రేమ కథ సుఖాంతమైందా లేదా?
లీల మాటలతో సోలమన్ తనను తాను ఎలా మార్చుకున్నాడు? తన ఆత్మన్యూనతను వీడి ఎలా నిలబడ్డాడు? వారి ప్రేమ కథ సుఖాంతమైందా లేదా? అనే అంశాలను దర్శకుడు వినయ్ రత్నం చాలా హృద్యంగా తెరకెక్కించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ, గోపీనాథ్ తమ నటనతో ప్రాణం పోశారు.
నవతరం సినిమాలను ఇష్టపడేవారు, మంచి సందేశాత్మక చిత్రాలను కోరుకునేవారు ఈ నెల 19న ఈటీవీ విన్‌లో తప్పక చూడాల్సిన చిత్రమిది.












Click it and Unblock the Notifications