చనిపోతే నేరాలన్నీ మాఫీ అవుతాయా.. నానా పటేకర్‌పై నోరు పారేసుకున్న తనుశ్రీ దత్తా
బాలీవుడ్ నట దిగ్గజం నానా పటేకర్ మరణంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. 48 ఏళ్ల కెరీర్‌లో తన నటనతో ఎన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు నానా పటేకర్‌కు సంతాపం తెలియజేస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఆయనపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అది ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఆయన మరణిస్తే ఈవిల్ డెడ్ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై నానా అభిమానులు, నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా చనిపోయిన వ్యక్తిపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
2018లో భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసిన మీటూ ఉద్యమానికి నాంది పలికింది తనుశ్రీ దత్తాయే. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ దత్తా... నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో నానా పటేకర్‌కు క్లీన్‌చిట్ లభించింది. ఆ తర్వాత కూడా నానా పటేకర్ టార్గెట్‌గా తనుశ్రీ సోషల్ మీడియాలోనూ, ఇంటర్వ్యూలలోనూ కామెంట్స్ చేసేది. నానా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

అయితే అక్టోబర్ 8వ తేదీన నానా పటేకర్ కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అభిమానులు, ప్రముఖులు ఆ మహానటుడికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే తనుశ్రీ మాత్రం దారుణంగా మాట్లాడుతూ ఓ వీడియో వదిలింది. ఈ వార్త తెలిసింది.. ఈరోజు నాకు చాలా పని ఉంది, ఓ ముఖ్యమైన కార్యక్రమం నిమిత్తం లక్నోకి వెళ్తున్నాను. దాని మీదే మనసు పెట్టి.. మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ సాయంత్రానికి మీడియా మొత్తం ఆయన మరణం గురించే ఫోకస్ చేస్తుందని వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా ఈవిల్ డెడ్ అంటూ నోరుజారింది. ఈ వ్యాఖ్యలతో తనుశ్రీపై నెటిజన్లు, సినీ ప్రముఖులు మండిపడ్డారు. ఏకంగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) కూడా తీవ్రంగా స్పందించింది. చనిపోయిన వ్యక్తి పట్ల ఏ మాత్రం మానవత్వం లేకుండా మాట్లాడతారా? సినీ రంగంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి వ్యక్తి మీరేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనపై జరుగుతున్న ట్రోలింగ్‌తో తనుశ్రీ దత్తా మరోసారి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో పెట్టింది. నానా పటేకర్ మరణంతో ఆన్‌లైన్‌లో నా మీద వ్యతిరేకత పెరిగిపోయింది. అతని గురించి వాస్తవాలు బయటపెట్టినప్పటి నుంచి నా జీవితం నరకంలా మారిపోయింది. మీ టూ ఉద్యమం తర్వాత నాకు భద్రత కరువైంది. ప్రతిరోజూ నరకం చూశాం.. కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యేలా చేశారు, రౌడీలు వెంటాడేవారు. అతను నన్ను ఒంటరిగా వేధించలేదు, కొందరితో గ్రూపు కట్టి హింసించాడు. ఓ వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను తన జీవితాంతం చేసిన నేరాలు మాఫీ అవుతాయా? ఇంత జరిగినా ఆ వ్యక్తి కనీసం నన్ను క్షమాపణలు కోరలేదని తనుశ్రీ వ్యాఖ్యానించారు.
చేసిన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు కోరాలి, ఒకరి జీవితాన్ని నాశనం చేశామని ఒప్పుకోవాలి. కానీ అలా జరగలేదు. క్షమించమని అడగని వారిని దేవుడు కూడా మన్నించడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా నాకు ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. అందుకే ఆయన మరణించినప్పుడు ఈవిల్ డెడ్ అని వ్యాఖ్యానించాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలాంటి పరిస్ధితులు ఎదుర్కోన్నానో నాకు తెలుసు. అవన్నీ బహిరంగంగా చెప్పలేను.. బహుశా అది వింటే మీకు కన్నీరు ఆగదేమోనని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నానా పటేకర్ అభిమానులు, నెటిజన్లు తనుశ్రీ దత్తాపై సీరియస్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications
