కొంచెం అన్నా ఉండాలి... వీళ్లు హీరోలంటా?
'పుష్ప2' సినిమా డిసెంబరు ఐదోతేదీన విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాకు 4వ తేదీ రాత్రి రెండు బెనిఫిట్ షోలు వేసుకోవడంతోపాటు, టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే ఇటీవలే విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర'కు కూడా అర్థరాత్రి బెనిఫిట్ షోలతోపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ టికెట్ ధరలతో ఎవరైనా సినిమా చూడగలరా? లేదా? అనేది వారికే తెలియాలి. ఎందుకంటే అభిమానాన్ని హీరోలంతా క్యాష్ చేసుకుంటారు. వారికి నిజమైన అభిమానం అభిమానులమీద లేదని కచ్చితంగా చెప్పొచ్చు.
ఒక్క హీరో కూడా స్పందించలేదు
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే సమయానికి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా ఉంది. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీలోని కీలక నేత పరోక్షంగా ప్రోత్సహించారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. నగరంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. తద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాలు అందుబాటులో ఉండకూడదు. డ్రగ్స్ తీసుకున్న మత్తులో హత్యలు, అత్యాచారాలు, వివాదాలు తలెత్తుతాయి. వాటిని నిర్మూలించాలంటే డ్రగ్స్ వాడకాన్ని నిలిపివేయాలని రేవంత్ రెడ్డి భావించారు. సినీరంగానికి చెందిన స్టార్ హీరోలతోపాటు ఇతర సెలబ్రిటీలంతా తలా ఒక చెయ్యి వేస్తే అభిమానులు వారి మాటలు వింటారని, డ్రగ్స్ ను నియంత్రించవచ్చని రేవంత్ భావించి సినీరంగానికి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ఒక్కరు కూడా స్పందించలేదు.

చిరంజీవి ఒక్కరే స్పందించారు
మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే స్పందించి ఒక ప్రకటన చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా ఎవరూ ముందుకు రాలేదు. కనీసం వీడియో చేసి విడుదల చేయాలనే స్పృహ కూడా హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు, సెలబ్రిటీలకు లేదు. దీనిపై రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో సినీరంగానికి విజ్ఞప్తి చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంతే అడుగుతున్నా ఎవరూ స్పందించలేదు. మంత్రి కొండా సురేఖ వివాదంలో మాత్రం అందరూ నాగార్జున కుటుంబానికి మద్దతు పలికారు. అందులో తప్పులేదు. అయితే వివాదం పెద్దదవుతుందని, ఆపమని రేవంత్ కోరినా వినకుండా అందరూ ఖండనలమీద ఖండనలు ఇచ్చారు. ఆయన కోరిన డ్రగ్స్ మీద మాత్రం ఎవరూ ప్రకటనలు చేయలేదు.
'దేవర'కు తారక్ వీడియో విడుదల
'దేవర' సినిమా విడుదలవుతున్న తరుణంలో వరదలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి జూనియర్ ఎన్టీఆర్ కోటిరూపాయల విరాళం ఇచ్చారు. తర్వాత డ్రగ్స్ ను నియంత్రించాలంటూ అభిమానులను, అందరినీ కోరుతూ వీడియో విడుదల చేశారు. ఎందుకంటే సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సివుంటుంది కాబట్టి. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 365 రోజులు షూటింగ్ జరగదు. కచ్చితంగా ఎన్నోరోజులు సెలవులుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లొచ్చారుకానీ డ్రగ్స్ నియంత్రణమీద మాత్రం వీడియో విడుదల చేయలేదు.
రేపు మరో హీరో సినిమా టికెట్ ధరల కోసం మరో వీడియో..
ఐదో తేదీన 'పుష్ప2' విడుదలవుతోంది కాబట్టి ఇప్పుడు వీడియో విడుదల చేశారు. ఇలా ఈ హీరోలిద్దరూ వీడియోలు చేసిన తరుణంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రేపు మరో హీరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆ హీరో రంగంలోకి దిగుతాడు. దిగి డ్రగ్స్ వాడొద్దంటూ మొక్కుబడిగా ఒక వీడియో విడుదల చేస్తాడు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఆనందపడి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వారి సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేస్తారు. ఇదీ సంగతి.. ఈ హీరోలకు నిజంగా సమాజంమీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అడిగిన సమయంలోనే డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకించేందుకు అందరూ కలిసి నడుం బిగించేవారు. కానీ వారికి కావాల్సింది సమాజంకాదు.. సినిమా టికెట్ ధరల పెంపు.. అంతే. భారతదేశంలో హీరోల అభిమానాన్ని తెలివిగా 'క్యాష్' చేసుకునేది మన తెలుగు హీరోలు మాత్రమే.












Click it and Unblock the Notifications