‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన 'వ్యూహం' (Vyooham) సినిమా విడుదలకు బ్రేక్ పడింది. జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేసింది.
వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది. ఈ క్రమంలో సినిమా విడుదలకు హైకోర్టు నిరాకరించింది. జనవరి 11 వరకు సినిమాను విడుదల చేయొద్దంటూ స్పష్టం చేసింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. రంగం సినిమా ఫేం అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో టీడీపీ అధినే చంద్రబాబు నాయుడును కించపరిచేలా చూపించారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు.
ఈ మేరకు వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.
ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్
వ్యూహం సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ పై కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను పునర్ సమీక్ష చేయాలని కోరారు. రాజేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications