యాంకర్ విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టు భారీ షాక్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో యాంకర్ విష్ణు ప్రియకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలంటూ విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది.
అయితే ఈ నెల 25న కూడా ఆమె మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. నేడు ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. చట్ట ప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఈ కేసు విషయంలో ఆమెకు కొంత ఊరట కూడా లభించందని చెప్పవచ్చు. విష్ణుప్రియను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే విచారణలో పోలీసులకు సహకరించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలానే ఈ కేసులో మియాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో నమోదైన రెండు కేసులను క్లబ్ చేయాలని హైకోర్టు సూచించింది. ఇక ఈ వ్యవహారం మరింత ముదురుతున్న తరుణంలో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications