టాలీవుడ్‌లో ముదురుతున్న వివాదం.. భారీ ఎత్తున సినీ కార్మికుల నిరసన
తెలుగు చిత్రపరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె తీవ్రస్థాయికి చేరుతుంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా నగర్‌లోని తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ ధర్నా నిర్వహిస్తున్నారు
నిర్మాతలపై తీవ్ర విమర్శలు..
ఈ నిరసనలో పలువురు యూనియన్ నేతలు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ - "మాకు స్కిల్ లేదని ఎలా అంటారు? స్కిల్ లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా వందల సినిమాల్లో ఎలా పని చేసాం?" అని ప్రశ్నించారు. కొంతమంది నిర్మాతలు పట్టించుకోని ధోరణిలో ఉన్నారని, మరికొందరు జంకుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ రోజు నుంచి పూర్తిగా షూటింగ్‌లు ఆపి ధర్నాలు చేపడతామని, ఛాంబర్‌కి బంద్ నోటీసులు పంపిస్తున్నామని తెలిపారు. "భయపెట్టి పని చేయించుకోవాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ మేమంతా ఐక్యంగా ఉన్నాం. మా డిమాండ్లు సాధించేవరకు పోరాటం కొనసాగిస్తాం" అని కార్మిక నాయకులు హామీ ఇచ్చారు.
వేతనాల పెంపుపై డిమాండ్..
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కార్మికులు గత మూడు ఏళ్లుగా వేతన పెంపు కోరికను వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జీతాలు పెంచలేదని ఆరోపించారు. ఏడాదికి కనీసం 10% పెంపు ఇవ్వాలని, ప్రస్తుతం 30% వేతన పెంపు చేస్తేనే పని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విడతల వారీగా సిబ్బంది కేటగిరీ విభజించి పెంపు చేయాలనే నిర్మాతల ప్రతిపాదనను వారు తిరస్కరించారు.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ముందు.. మరోసారి ఛాంబర్‌తో చర్చలకు హాజరవుతామని, కానీ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
సినీ షూటింగ్‌లపై ప్రభావం..
ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక సినిమా షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్ద సినిమాలు, చిన్న బడ్జెట్ ప్రాజెక్టులు అన్నీ ప్రభావితమవుతున్నాయి. అయితే సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి తగిన వేతనం మాత్రమే కోరుతున్నాం" అని కార్మికులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications