మెగాస్టార్‌కి "తమ్మారెడ్డి భరద్వాజ" సాలిడ్ కౌంటర్.. "క్యాస్టింగ్ కౌచ్" రచ్చ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సినిమా సక్సెస్ మీట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సినీ పరిశ్రమను ఒక "అద్దం"తో పోలుస్తూ.. మన ప్రవర్తన ఎలా ఉంటే, అదే మనకు తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. అవకాశాల కోసం తప్పు మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం లేదని, అంకితభావం, కష్టపాటు, నైపుణ్యంతో పనిచేస్తే పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.
అంతే కాకుండా క్యాస్టింగ్ కౌచ్ అనేది పరిశ్రమ మొత్తం సమస్య కాదని, కొందరి వ్యక్తిగత ప్రవర్తనల వల్లే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. మొత్తం పరిశ్రమను ఒకే కోణంలో చూడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అయితే చిరంజీవి చేసిన ఈ అనూహ్య కామెంట్స్ పై నెటిజన్లు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలకు కౌంటర్స్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు.

చిన్మయి రియాక్షన్..
ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. చిరంజీవిపై తనకు అపారమైన గౌరవం ఉందని చెబుతూ, ఆయన మాటలు నేటి సినీ పరిశ్రమ వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. సినీ రంగంలో "కమిట్‌మెంట్" అనే పదం కేవలం వృత్తిపరమైన అర్థంలో కాకుండా.. చాలాసార్లు లైంగిక ఒత్తిడికి సంకేతంగా మారుతోందని చిన్మయి ఆరోపించారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావని తాను అనేక సందర్భాల్లో చూశానని, విన్నానని తెలిపారు. ఒక మహిళా సంగీత కళాకారిణిని స్టూడియోలో లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్‌లో దాక్కుందని వెల్లడించారు.
తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు వ్యాఖ్యలు..
ఈ వివాదంపై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లేటెస్ట్ గా స్పందించారు. పరిశ్రమలో వేధింపులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవమని అంగీకరించారు. అయితే అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారని చెప్పడం మాత్రం సరికాదని స్పష్టం చేశారు. ఏడాదికి సుమారు 250 సినిమాలు తెరకెక్కుతున్నాయని.. వాటిలో 30 నుంచి 40 సినిమాల్లో మాత్రమే మహిళలను ఇలా వాడుకునే ధోరణి కనిపిస్తుందని తెలిపారు. ఇది వ్యవస్థ మొత్తం సమస్య కాదని, కొందరి వికృత ఆలోచనల ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చిన్మయి చెప్పింది నిజమేనని తమ్మారెడ్డి అంగీకరించారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలో కొందరు పెద్దల్లో ఉందని, దాన్ని నిర్భయంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి, తమ్మారెడ్డి అభిప్రాయాలతో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది వ్యక్తిగత ప్రవర్తనల సమస్యా? లేక వ్యవస్థాగత లోపమా? అన్న ప్రశ్న మళ్లీ చర్చకు వచ్చింది. భవిష్యత్తులోనైనా పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications