ప్రభాస్‌కు ఒకలా.. విజయ్‌కు మరోలా.. ఏంది ఈ థియేటర్స్ పంచాయతీ !!
గ్లోబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుండగా.. మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్" సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ప్రభాస్ రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు.. భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు అలరించనున్నాయి. అయితే జనవరి 9న దళపతి విజయ్ నటించిన "జన నాయగన్".. తెలుగులో జననాయకుడుగా విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం పాన్ ఇండియా ఫీవర్ నడుస్తున్న తరుణంలో సినిమాలు పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇక్కడే అసలు సమస్య తలెత్తుతుందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మన సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాలకే ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారని తెలుగు వారు ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. కానీ మన సినిమాలకు మాత్రం పక్క రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతుందా అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కారణం అదే..
ఇందుకు ప్రధానంగా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్ ఇష్యూ అని తెలుస్తోంది. ఒకవైపు విజయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచిగా థియేటర్స్ లభిస్తుంటే.. మరోవైపు ప్రభాస్ సినిమాకు తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా లోనే టాప్ స్టార్‌గా పేరు పొందిన ప్రభాస్‌కు.. తమిళనాట సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ చిత్రాలకు తెలుగులో మార్కెట్ ఉన్నట్టే.. ప్రభాస్‌కు తమిళనాడులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయినా కూడా ఈసారి ఆయన సినిమా అక్కడ వెనుకబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగితే ఈ వివాదం పెద్దరచ్చకు దారి తీస్తుందని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications