‘అఖండ2’ విడుదల ఆగిపోవడం వెనక అసలు కారణం ఇదే
నందమూరి బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుడి సినిమా విడుదల ఆగిపోయిందంటే అందుకు చాలా కీలక కారణాలుంటాయి. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిసెంబరు 5న విడుదల కావాల్సిన అఖండ2 విడుదలవలేదు. ఎప్పుడు విడుదలవుతుందనేదానికి నిర్మాతల దగ్గర సమాధానం లేదు. 14 రీల్స్ బ్యానరుపై ఈ సినిమాను నిర్మించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట అధినేతలు. ఈ సంస్థకు, ఎరోస్ సంస్థకు కొన్నాళ్లుగా విభేదాలు నడుస్తున్నాయి. వాస్తవానికి వీరికి, ఎరోస్ కు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. అయితే 14 రీల్స్ సంస్థలోనే మరో నిర్మాత అనిల్ సుంకర భాగస్వామిగా ఉన్నారు. మహేష్ బాబు దూకుడు సినిమా సమయంలో వీరికి, ఎరోస్ కు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి.
ఫైనాన్షియర్స్ అడ్డుకుంటారు
ఆ సమయంలోనే 14 రీల్స్ కు, ఎరోస్ కు చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. అక్కడి నుంచి అవి పెరిగి పెద్దవయ్యాయి. అయితే సర్కారువారి పాట సినిమా విడుదల సమయంలో మౌనంగా ఉండిపోయిన ఎరోస్ ఇప్పుడు అఖండ2 విషయంలో మాత్రం మద్రాసు హైకోర్టు నుంచి స్టే తెచ్చింది. సినిమా విడుదల కాకుండా చూసుకుంది. ఎరోస్ కు రామ్ ఆచంట, గోపీ ఆచంట రూ.28 కోట్లు చెల్లించాలి. అది చెల్లిస్తేనే సినిమా విడుదలవుతుంది. అంతేకాదు.. మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నిర్మాతలకు, అఖండ2కు ఫైనాన్స్ చేసినవారి మధ్య కూడా విభేదాలున్నాయని, సినిమా విడుదలను వారు అడ్డుకునే అవకాశం ఉందనేది ఆ వార్తల సారాంశం.

సంక్రాంతికి వస్తుందా?
ఎరోస్ సంస్థ తమకు 14 రీల్స్ వారు డబ్బులివ్వడాలనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టుకు నిరూపించగలిగింది. దీంతో కోర్టులో కేసు గెలిచింది. ఇప్పుడు నిర్మాతలిద్దరూ ఈ రూ.28 కోట్లు చెల్లించడంతోపాటు ఫైనాన్షియర్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి చెల్లిస్తేనే సినిమా విడుదలవుతుంది. ఇన్ని సమస్యల మధ్య బాలయ్య అయినా, బోయపాటి శ్రీను అయినా ఏం చేయగలరు అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు. అయితే సినిమా ఈ నెలలో విడుదలవుతుందా? అంటే అందరూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జనవరిలో సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అఖండ2 ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications