చిరంజీవి - నాగార్జున కాంబోలో మిస్ అయిన 2 బ్లాక్ బస్టర్లు
టాలీవుడ్ తెరపై ఇద్దరు ఉద్ధండులు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరు. ఒకరు మాస్ ఆడియెన్స్‌ను ఊపేసే మెగాస్టార్.. మరొకరు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించే కింగ్. చిరంజీవి, నాగార్జున వ్యక్తిగతంగా ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, ఇండస్ట్రీని ఏలిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటివరకు ఒక్క ఫుల్ లెంత్ చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే, వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అప్పట్లోనే ఓ రెండు భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టులు ప్లాన్ జరిగాయట. ప్రేక్షకుల అదృష్టం కొద్దీ సెట్స్ పైకి వెళ్లాల్సిన ఆ రెండు సినిమాలు ఏ కారణాల వల్ల ఆగిపోయాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈవీవీ సత్యనారాయణ కాంబో (కథ దాకా వెళ్లి..)
90వ దశకంలో టాలీవుడ్‌ను తమ చిత్రాలతో శాసించిన దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. చిరంజీవితో 'అల్లుడా మజాకా' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఆయన.. నాగార్జునతో 'హలో బ్రదర్' వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ ఇద్దరు స్టార్స్‌తోనూ విడివిడిగా అద్భుతమైన హిట్లు కొట్టిన ఈవీవీ.. వీరిద్దరినీ ఒకే సినిమాలో పెట్టాలని గట్టిగా ప్లాన్ చేశారట. ఈ క్రేజీ కాంబో కోసం ఓ పవర్ పుల్ కథను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆ కాలంలో ఇద్దరు స్టార్ హీరోల డేట్స్ సర్దుబాటు చేయడం, సమీకరణాలు కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకుండానే ప్రారంభ దశలోనే ఆగిపోయింది.

షూటింగ్ మొదలై.. ఆగిపోయిన రాఘవేంద్రరావు సినిమా
చిరు, నాగ్ కాంబోలో కేవలం చర్చల వరకే ఆగిపోకుండా.. ఏకంగా షూటింగ్ వరకు వెళ్లిన సినిమా మరొకటి ఉంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు ఈ ఇద్దరితో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోలకు కథ చెప్పడం, వారికి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు, హీరోయిన్‌గా అప్పట్లో అందరి హృదయాలను దోచుకున్న సౌందర్యను కూడా ఫైనల్ చేశారు. షూటింగ్ ప్రారంభమై, సినిమా దాదాపు పది శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ, ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. కథ పూర్తిగా చిరంజీవి ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు నప్పుతుందా లేదా అనే విషయంలో దర్శకుడు రాఘవేంద్రరావుకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చునని ఆయన భావించారు.
ప్రాజెక్టు ఆపేద్దాం
ఈ విషయాన్ని ఆయన నాగార్జునతో ప్రస్తావించగా.. "దర్శకుడికే నమ్మకం లేనప్పుడు ఆ సినిమా చేయడం వేస్ట్, ప్రాజెక్ట్‌ను ఆపేయడమే మంచిది" అని నాగ్ చాలా మెచ్యూర్డ్‌గా సలహా ఇచ్చారట. చిరంజీవి కూడా ఇదే అభిప్రాయంతో ఏకీభవించడంతో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఆ భారీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నాగార్జున మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ముందుంటారు. గతంలో హరికృష్ణతో 'సీతారామరాజు', కార్తీతో 'ఊపిరి' వంటి చిత్రాలు చేసి మెప్పించారు. ఇటీవలి కాలంలోనూ 'కుబేర', 'కూలీ' లాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేశారు. మరోవైపు చిరంజీవి కూడా ప్రయోగాత్మక చిత్రాలకు వెనుకాడట్లేదు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పటికైనా మనసు చేసుకుని ఒక మంచి మల్టీస్టారర్ చేస్తే చూడాలని టాలీవుడ్ సినీ ప్రియులు, మెగా-కింగ్ అభిమానులు ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఆ కలయికను కాలం నిజం చేస్తుందేమో చూడాలి.














Click it and Unblock the Notifications
