అన్‍స్టాపబుల్ షోను రాజకీయాలకు భలే వాడుకుంటున్నారే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షో , నాలుగో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. అన్‌స్టాపబుల్ 4వ సీజన్‌కు సంబంధించి ఇటీవలే ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో మంచి జోష్ చూపించారు బాలకృష్ణ. ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ఏ ముహూర్తానా అన్‌స్టాపబుల్ మొదలుపెట్టారో కానీ, ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారాయన. ఇంకా చెప్పాలంటే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇక నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా టీడీపీ అధినేత ,ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. గతంలో చంద్రబాబు అన్‌స్టాపబుల్ షో హాజరయ్యారు. అయితే ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు తొలిసారి సీఎం హోదాలో అన్‌స్టాపబుల్ షోకు వస్తున్నారాయన. అన్ స్టాపబుల్ సీజన్ 2కు వచ్చిన చంద్రబాబు అప్పుడు చాలా విషయాలపై ముచ్చటించారు. రాజకీయ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఈ షో ద్వారా తెలియజేశారు.

బాలయ్య కూడా చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రశ్నలతో.. రొమాంటిక్ ప్రశ్నలతో సమాధానాలు రాబట్టడం ద్వారా షోను మరింత రక్తికట్టించారు. అల్లుడు లోకేష్‌ను సైతం విదేశాల్లో అమ్మాయిలతో ఉన్న ఫొటోలు చూపించి ఇరుకున పెట్టాలని చూశారు. ఈ నేపథ్యంలో ఈ సారి సీజన్ 4 షోలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు ఏం సమాధానాలు చెబుతారన్నదానిపై ప్రేక్షకుల్లో, వారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబాబు తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈషోకు మరోసారి హాజరుకానున్నారని తెలుస్తోంది. గతంలో పవన్ సైతం ఈ షోకు హాజరయ్యారు. అయితే ఎంటర్‌టైన్ షోని , పోలిటికల్ షోగా మార్చేస్తున్నారనే అపవాదు ఈ షోపై ఉంది.
తొలుత సినీ సెలబ్రిటీలను మాత్రమే పిలిచిన షో యాజమాన్యం, తర్వాత ఏపీలో ఎన్నికలు దగ్గర పడిన సమయంలో వారికి అనుకూలమైన నాయకులను తీసుకువచ్చి,తమకు నచ్చిన విధంగా సమాధానాలు చెప్పించారనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడిలో కలిగేలా చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారిని తీసుకువచ్చి ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే షో చూసేలా చేస్తున్నారని కామెంట్స్ తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఈ షోను రాజకీయాలకు గట్టిగానే వాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నాలుగో సీజన్ అక్టోబర్ 24న మొదలవుతుందని ఆహా పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనే తొలి ఎపిసోడ్ ఆ రోజే వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications