'కూలీ', 'వార్'2 సినిమాలు మనకు ఏం నేర్పాయి?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన కూలీ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ మల్టీస్టారర్ వార్2 చిత్రానికి దర్శకుడు అయాన్ ముఖర్జీ. కూలీకి రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే, వార్2కు రూ.400 కోట్లు పెట్టారు. ఈ రెండు చిత్రాలను రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సన్ పిక్చర్స్, యష్ రాజ్ ఫిలింస్ నిర్మించాయి. మొదటి నుంచి ఈ రెండు సినిమాల విడుదలపై అంచనాలు భారీగా ఉన్నాయి. దక్షిణాదిలో కూలీపై ఉంటే, ఉత్తరాదిలో వార్2పై ఉన్నాయి. ప్రేక్షకులు అంత అంచనాలు పెట్టుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రూపొందించుకొని సినిమాలు తీయాల్సిన బాధ్యత దర్శకులపై ఉంటుంది. వారిచేత ఆ పని చేయించాల్సింది నిర్మాతలు.
గ్రాఫిక్స్ లేకుంటే బాగుండేది
వార్2లో వీఎఫ్ఎక్స్ పనులు సిల్లీగా ఉన్నాయి. అసలు అవి లేకుండా కూడా తీసినా బాగుండేది. అలా కాకుండా రూ.400 కోట్లు ఖర్చుపెట్టి ఏం తీశారో అనేది ఎవరికీ అర్థం కాలేదు. అంత ఖర్చుపెట్టినవాళ్లు గ్రాఫిక్స్ కు కూడా భారీగా ఖర్చుపెడితే సరిపోయేది. అవసరమైతే సమయం తీసుకోవాలి. అలా చేయలేదు. ఇద్దరు హీరోల మధ్య ఉండే పోరాటాన్ని మాత్రమే నమ్ముకున్నారేమో అనిపిస్తుంది. ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్నప్పుడు జాగ్రత్తగా కథను ఎంచుకోవాలి. లేదంటే ఒప్పుకోకూడదు. ఎన్టీఆర్ చేయాల్సింది ఒక్కటే.. తాను ఎవరి సినిమాల్లోకి వెళ్లకూడదు.. తనలాంటి నటుడి సినిమాలోకి మిగతావారిని తీసుకురావాలి. ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటుడు చేయాల్సిన పని ఇదొక్కటే. తన హావభావాలు, తన నటన తాను చేస్తూ దాన్నే దేశంలో అందరికీ చూపించాలి. అలా కాకుండా నేరుగా బాలీవుడ్ కు వెళ్లకూడదు. మన సినిమాను మాత్రమే అక్కడకు తీసుకువెళ్లాలి.

దర్శకుడు ఒక్కడే ఉన్నారు
లోకేష్ కనగరాజ్ తన సినిమాలన్నింటిలోను రెండో భాగాన్ని సరిగా చిత్రీకరించలేదు. రెండోభాగం బాగుండదు. కూలీ కూడా అంతే.. చివరి గంట దారుణం. మంచి టాలెంట్ ఉందని చెప్పుకునే లోకేష్ ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాడో అతనికే తెలియాలి. ఖైదీ, విక్రమ్ మినహా మిగతావన్నీ సరిగా ఆడలేదు. హీరోలకు కథ చెప్పేటప్పుడు ఒకరకంగా ఉంటుంది.. తీసేటప్పుడు మరోరకంగా ఉంటుంది. ఈ అనుభవాలను చాలామంది హీరోలు ఎదుర్కొన్నారు. షూటింగ్ దశలో ఏం చేయలేని పరిస్థితి. ఇవన్నీ గమనించినప్పుడు దేశం మొత్తం మీద సినిమాను చాలా జాగ్రత్తగా, ప్రేక్షకులకు నచ్చేలా తీయగలిగే దర్శకుడు మన దేశంలో ఒక్కడే ఉన్నాడేమో.. ఆ ఒక్కడు రాజమౌళి అని అనిపిస్తుంటుంది. అది వాస్తవం కూడా.












Click it and Unblock the Notifications