అల్లు అర్జున్ అరెస్ట్‌కు డేట్ ఫిక్స్ చేశారా?
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 10వ తేదీన అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? అనే ఉత్కంఠ బన్నీ అభిమానులతోపాటు న్యాయవర్గాల్లోను నెలకొంది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న బన్నీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. ఈనెల 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట అల్లు అర్జున్ హాజరైన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా హీరోలైన తరుణంలో..
పుష్ప2 సినిమాతో బన్నీకి వచ్చిన క్రేజ్, ఇమేజ్ ఈ కేసువల్ల మసకబారుతున్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు బయటకే మాట్లాడినప్పటికీ మరికొందరు మాత్రం అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బన్నీ చేసిన పనికి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునివ్వడం ప్రభుత్వం మానేసింది. ఈ ప్రభావం భారీ బడ్జెట్ చిత్రాలపై పడబోతోంది. తెలుగు హీరోలంతా పాన్ ఇండియా హీరోలుగా మారి భారీ కలెక్షన్లు సాధిస్తుండటంతోపాటు, భారీ రికార్డులను నమోదు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సంధ్య థియేటర్ లో చోటుచేసుకున్న ఘటన తెలుగు పరిశ్రమను ఇక్కట్లకు గురిచేస్తోంది.

వివాదం తగ్గుముఖం పట్టిందా?
అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి మధ్య వివాదం తగ్గుముఖం పట్టిందా? 10వ తేదీన బన్నీ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? రేవంత్ రెడ్డి పరిశ్రమపై మెతక వైఖరితో ఉంటారా? ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా? బయట పడతాడా? అనే ప్రశ్నలు రెండు రాష్ట్రాల ప్రజలను తొలుస్తున్నాయి. అయితే న్యాయవాదుల సలహా మేరకే బన్నీ నడుచుకునే అవకాశం ఉంది. వీలైతే రెగ్యులర్ బెయిల్ రావడానికే లాయర్ నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కౌంటరు దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరడంతో ప్రభుత్వం బన్నీపై మెతక వైఖరితోనే ఉందని అర్థమవుతోందని, దాదాపుగా ఈ కేసు నుంచి అతను బయటపడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కేసులో బన్నీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఉన్నారని, 10వ తేదీన అరెస్ట్ ఉండే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎవరి అభిప్రాయాలు కార్యరూపం దాలుస్తాయో తెలియాలంటే జనవరి 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.












Click it and Unblock the Notifications