యష్ చేసిన పొరపాటు చాలా కాస్ట్‌లీ
ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయం స్టార్ హీరోల కెరీర్‌ను ఆకాశానికి ఎత్తుతుంది. కానీ, అదే విజయం ఒక్కోసారి వాళ్లకు సరికొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. ఆ సక్సెస్ హ్యాంగోవర్ నుంచి బయటకు రాకపోవడం, ప్రేక్షకులు తమను ఎప్పటికీ ఆ ఒక్క తరహా ఇమేజ్‌లోనే చూడాలనుకుంటున్నారని భ్రమపడటం ఏమాత్రం మేలు చేయదు. పరిశ్రమ చరిత్ర తిరగేస్తే ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్ తర్వాత నాగార్జున ఖాతాలో దాదాపు పది ఫ్లాప్‌లు పడ్డాయి. 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ క్లాస్ ప్రయోగంగా చేసిన 'ఆరెంజ్' సినిమా, నిర్మాతగా నాగబాబును తీవ్ర ఆర్థిక నష్టాల్లో ముంచెత్తింది. 'బాహుబలి' వండర్ తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' కూడా ఇదే ఇమేజ్ ప్రెజర్ వల్ల ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
యష్ వేసిన తప్పుడు అడుగు!
తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఇదే తరహా ఇమేజ్ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒకే ప్రాజెక్ట్ కోసం ఏకంగా నాలుగేళ్లు కేటాయించడం, దాదాపు రెండేళ్ల పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులకే పరిమితమవ్వడం, రీ-షూట్లు, వాయిదాలు, లీగల్ సమస్యలు.. ఇలా కోట్లాది రూపాయల నిర్మాత సొమ్ము సంవత్సరాల తరబడి లాక్ అయిపోయింది. అంతా తానై నడిపించి థియేటర్లకు తీసుకొచ్చినా, బెనిఫిట్ షోల నుంచే మిశ్రమ స్పందన మొదలైంది. హిందీ, కన్నడలో కాస్త పర్వాలేదనిపించినా, తెలుగు సహా మిగిలిన ప్రాంతీయ భాషల్లో బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.

యష్ చేసిన ప్రధాన పొరపాటు - ఇమేజ్ హ్యాంగోవర్
'కెజిఎఫ్' సిరీస్ యష్‌కు పాన్-ఇండియా వ్యాప్తంగా అపారమైన మార్కెట్‌ను అందించిన మాట వాస్తవమే. కానీ, ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులు ఆయనను రాఖీ భాయ్ లాంటి విపరీతమైన రౌద్రంతో, మిషన్ గన్ పట్టుకుని నరమేధం సృష్టించే గ్యాంగ్‌స్టర్‌గానే చూడాలని అనుకోరు. కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్‌లోనే సరికొత్త కథనాలను ట్రై చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదే గడ్డం, అదే మెషిన్ గన్ల విధ్వంసం, మోతాదు మించిన రొమాన్స్.. ఇవన్నీ ప్రేక్షకులకు పాతపడిపోయి సినిమా రిజల్ట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
మారిన ప్రేక్షకుల పల్స్
నేటి ప్రేక్షకుడు కేవలం మాస్ ఇమేజ్‌ను చూసి థియేటర్లకు రావడం లేదు; కథలో కొత్తదనం కోరుకుంటున్నాడు. వరుసగా అరడజను మాస్ రొటీన్ సినిమాలు చేసి డిజాస్టర్లు చూసిన మాస్ మహారాజా రవితేజ, రూట్ మార్చి అయ్యప్ప మాల వేసుకుని, రెండు భక్తి పాటలున్న ఒక డిసెంట్ క్రైమ్ డ్రామాలో కనిపించేసరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. 'సలార్' లాంటి హై-వోల్టేజ్ యాక్షన్లు చేస్తూనే, 'ఫౌజీ'లో బ్రిటిష్ కాలం నాటి సైనికుడిగా, 'స్పిరిట్'లో పోలీస్ ఆఫీసర్‌గా తన జానర్లను నిరంతరం మారుస్తూ ముందుకు వెళ్తున్నారు. యష్ కూడా ఈ కోణంలో ఆలోచించి, తన కంఫర్ట్ జోన్, మాస్ ఇమేజ్ బెంచ్ మార్క్ నుంచి బయటకు వచ్చి కొత్త కథలను ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ వైవిధ్యం చూపించిన రోజు.. భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులు ఆయనకు తిరుగులేని కిరీటం తొడగడానికి సిద్ధంగా ఉన్నారు!














Click it and Unblock the Notifications