ప్రభాస్ కాదు..ఫిష్ వెంకట్‌కు సాయం చేసింది ఈ హీరోనే..!
ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని సమాచారం.
ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఇటీవల మాట్లాడుతూ, వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చికిత్సకు అయ్యే దాదాపు రూ. 50 లక్షల ఖర్చు తమకు భారంగా మారిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో విశ్వక్ సేన్, ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కష్ట సమయంలో వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. విశ్వక్ సేన్ చూపిన ఈ మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఫిష్ వెంకట్‌కు సాయం చేస్తారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం చేశారనే ప్రచారం జరిగింది. రూ.50 లక్షలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం ప్రభాస్ అందించారని, ఆపరేషన్ ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చేశాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్ కుటుంబం తాజాగా ఒక వీడియో ద్వారా స్పష్టం చేసింది. తమకు ప్రభాస్ నుండి గానీ, ఆయన బృందం నుండి గానీ ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని, అసలు ఫోన్ కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభాస్ పీఏ అంటూ ఓ వ్యక్తి కాల్ చేశారని, కానీ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఫిష్ వెంకట్ చికిత్సకు భారీగా ఖర్చవుతుందని, దాతలు, సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఫిష్ వెంకట్ అండగా విశ్వక్ సేన్ నిలిచారు.












Click it and Unblock the Notifications