ఆ వార్తలను నమ్మవద్దు- ప్రయాణికులకు రైల్వే శాఖ సూచన
Tatkal ticket booking timings: తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కథనాలు, విస్తృత ప్రచారంపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. టికెట్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, అలాంటి ప్రతిపాదనలు ఏవీ కూడా లేవని తేల్చిచెప్పింది.
తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సవరణలు చేసిందంటూ సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కొత్త మార్పులు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందంటూ కథనాలు వెల్లువెత్తాయి.

తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో ప్రయాణికుల నుంచి భారీగా డిమాండ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించిందనేది ఆయా కథనాల సారాంశం. టికెట్ బుకింగ్, టైమ్ టేబుల్, వాటి రద్దు.. వంటి విధానాల్లో మార్పులు రైల్వే శాఖ మార్పులు చేసిందంటూ ప్రచారం సాగింది.
దీని ప్రకారం చూస్తే- ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఉదయం 11 గంటలకు తత్కాల్ ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్, మధ్యాహ్నం 12 గంటలకు నాన్-ఏసీ/స్లీపర్ క్లాస్ టికెట్ల జారీ మొదలవుతుంది. ముందు రోజే తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఈ కథనాలు, ప్రచారంపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ విధానంలో ఎలాంటి సవరణలు చేయలేదని వెల్లడించింది. టికెట్ బుకింగ్ నియమాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా పోస్ట్‌లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని, అవి యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం- ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఏసీ క్లాస్ 2ఏ/3ఏ/సీసీ/ఈసీ/3ఈల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ ఎప్పట్లాగే- ప్రయాణానికి ముందు రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ కోసం తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రయాణానికి ముందు రోజు ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ప్రయాణికులు అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ ఇ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Fact Check
వాదన
తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో మార్పు
వాస్తవం
తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో మార్పు చేయలేదు. దీన్ని కేంద్రం ధృవీకరించింది.












Click it and Unblock the Notifications