Fact Check:భారత్‌లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారు.. వీడియో వైరల్,ఈ వార్తలో నిజమెంత?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి నిఘాను పెడుతున్నాయి. అప్పుడెప్పుడో ప్లాస్టిక్ గుడ్లు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అదే వీడియో మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. భారత్‌లో ప్లాస్టిక్ గుడ్లను అమ్ముతున్నారని చెబుతూ ఈ వీడియో హల్చల్ చేస్తోంది. చైనాలో ఈ ప్లాస్టిక్ గుడ్లు తయారై భారత్‌కు దిగుమతి అయి ఇక్కడే వాటిని విక్రయిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఫేస్‌బుక్‌లో మళ్లీ వీడియో వైరల్ అవుతోంది అది కూడా భారత్ చైనా దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఈ వీడియో వైరల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్లాస్టిక్ గుడ్లను అమ్ముతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో ఎంతమాత్రం నిజంకాదని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయినప్పటికీ ఇదీ పదేపదే సోషల్ మీడియాలో దర్శనం ఇస్తోంది. దీంతో చాలా మందిలో ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది నిజమేనా అనే ప్రశ్నలు కూడా వేశారు. ఈ వీడియో 2017, 2018, 2019లో వైరల్ కాగా మళ్లీ 2020లో కూడా వైరల్ అయ్యింది. అయితే ప్లాస్టిక్ గుడ్లు అని వైరల్ అవుతున్న వీడియోపై ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఇచ్చిన నివేదిక అన్ని అనుమానాలకు చెక్ పెట్టింది. 2018లో ఈ నివేదిక విడుదల చేసింది. అసలు ప్లాస్టిక్ గుడ్లు అనే కాన్సెప్టే లేదని ఇదంతా అవాస్తవమని నివేదిక తేల్చి చెప్పింది.

గుడ్లలో నీరు లేకపోవడంతో తెల్ల సొన మరియు పచ్చ సొన భాగాలు తగ్గిపోయి రెండు భాగాలు కలవడం జరుగుతుంది. అలా రెండు భాగాలు కలిసిన గుడ్డు విరిగినప్పుడు లేదా పగిలినప్పుడు అది పచ్చ సొన లేదా తెల్లసొన అనేవి కనిపించవు. పైగా ఇది ప్లాస్టిక్ గుడ్డును తలపిస్తుందని నివేదిక వెల్లడించింది. తేమ మాయమవడంతో గుడ్డు ఎండిపోయి ఒక పేపర్‌లా కనిపిస్తుంది.
ఇదే ప్లాస్టిక్‌ను తలపిస్తుందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ గమనించినట్లు వివరించింది. గుడ్లను తయారు చేసే టెక్నాలజీ కానీ రసాయనాలు కానీ ఇప్పటి వరకు లేవని స్పష్టం చేసింది. గుడ్లు అనేవి పెద్ద ఖర్చుతో కూడిన పని కాదని సరసమైన ధరలకే గుడ్లు విరివిగా దొరుకుతాయి కాబట్టి ప్లాస్టిక్ గుడ్లు తయారు చేసి అమ్మాల్సిన పరిస్థితి ఉండదని నివేదిక పేర్కొంది. దీంతో వైరల్ అవుతున్న ప్లాస్టిక్ గుడ్ల వీడియో అవాస్తవమని తేలింది.

Fact Check
వాదన
భారత్‌లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారంటూ పాత వీడియో వైరల్
వాస్తవం
అది పాత వీడియో. ప్లాస్టిక్ గుడ్లు అనేవి ఉండవని వెల్లడించిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నివేదిక












Click it and Unblock the Notifications