తెలంగాణ: బాబు పాత ఆటకు కొత్త పూత

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు గుంటూరులో సభ నిర్వహించి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారు. రాష్టాన్ని విభజిస్తే ఆత్మాహుతి దాడులకు దిగుతామని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. మిగతా నాయకులు కూడా దాదాపుగా అటువంటి ప్రకటనలే చేశారు. కలిసి ఉండాలని కోరుకునేవారు తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే పరిణామాలు ఎటు దారితీస్తాయో, ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బ తింటాయో వారికి తెలియంది కాదు. పరిస్థితిని మరింత విషమింపజేసే ఉద్దేశంతోనే వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనేది స్పష్టంగానే అర్థమవుతోంది. విడిపోదామని అడిగేవారిపై కన్నా కలిసి ఉండాలని అడిగేవారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుందనే కనీస విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు గ్రహించలేకపోయారని అనుకోవాలా, రాష్ట్రంలో పరిస్థితిని మరింత విషమింపజేయాలనే ఆలోచన చేస్తున్నారని అనుకోవాలా అనేది అర్థం కాని వ్యవహారంగా మారింది.
చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులకు ఎవరి మీద పోరాడాలని స్వేచ్ఛనిచ్చారో అర్థంకాని స్థితి. రెండు పరస్పర విరుద్ధమైన డిమాండ్లను ఒకేసారి నెరవేర్చడం సాధ్యం కాదనే విషయం తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు తెలియంది కాదు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ అంశంపై తమ పార్టీలోని ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతోంది. పార్టీపరంగా ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆ కసరత్తు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు కూడా అదే పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై మరోసారి సమీక్ష చేసి అందుకు విరుద్ధమైన వైఖరినైనా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అదే వైఖరిని మరోసారి ప్రకటించాల్సి ఉంటుంది. ఒక అంశం మీద పార్టీలో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసి మెజారిటీ ఆధారంగానైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఒక పార్టీ ఒక అంశంపై పరస్పర విరుద్ధమైన రెండు వైఖరులను ప్రదర్శించడం బహుశా చంద్రబాబుకే చెల్లిందని అనుకోవాలి.
- కె. నిశాంత్












Click it and Unblock the Notifications