వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ ప్రేమకథ: మనువు క్షేమంగానే ఉన్నాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

తమిళనాడుకు ధర్మపురి కి ‘వళ్ళలపట్టాయి'కి చెందిన ఇలవరసన్, అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ పక్కన చని పోయిన వార్త దేశ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది .తమిళనాడు ధర్మపురి సమీప ‘సేల్లన్కొట్టాయి'కి చెందిన నాగరాజు కూతురు నర్సింగ్ కళాశాలలో చదివే దివ్యకు 20 ఏళ్ళు వన్నియార్ కులానికి చెందిన దివ్యను ఆది ద్రావిడ (పరయా ) ఇలవరసన్ రెండేళ్ళు గా ప్రేమించు కున్నారు. దివ్య ఇంట్లో వత్తిడులకు భయపడి ఇద్దరూ తిరుపతికి పారి పోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు . తమిళనాడు లో ఈ పెళ్లి ఒక రాజకీయ ప్రకంపనలు కలిగించింది. ఇద్దరికీ మైనారిటీ తీరింది కలిసారు, ఇద్దరూ ఒకటిగా బ్రతకాలను కున్నారు, అంతే అదెలా సాధ్యం కులం గానోడు మా వన్నియార్ అమ్మాయిని లగ్గం జేసుకుంటడా ? అని కులసంఘాలు పంచాయితీలు పెట్టినవి, ఇలవరసన్ తల్లి దండ్రులను కుల పంచాయితి పిలిచి మర్యాదగా మా అమ్మాయిని వెనక్కి పంపు లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కుల సంఘాలు హుకుం జరీ చేసాయి. ముఖ్యంగా వన్నియార్ కుల సంఘం పెద్ద రామదాస్ పిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు స్వయంగా వచ్చి పంచాయితీ లో జోక్యం చేసుకొని అగ్గికి ఆజ్యం పోసి వందల ఇళ్ళకు నిప్పు పెట్టాడు .

దివ్య నర్సింగ్ కళా శాలలో చద్వుతోంది ఇలవరసన్ పదో తరగతి దాకా చదవి పోలీసు ఉద్యోగానికి ఎన్నిక అయి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. దివ్య కు పెళ్లి సంబందాలు చూస్తున్నారు చివరికి ఒకతనితో పెళ్లి కూడా కుదిరింది. నెలకు నలభై వేలు పైగా సంపాదన అతన్నే చేసుకో అని కులం కాని వాణ్ణి పెళ్లి చేసు కుంటావా అని దివ్య ను నానా విధాలుగా భయపెట్టారు .అలా ఇష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని దివ్య వెంటనే ఇలవరసన్‌తో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనే ప్రపోసల్ పెట్టింది , ఇద్దరూ పారిపోయి తిరుపతి లో పెళ్లి చేసుకున్నారు.ఇది జరిగి ఏడాది అయింది ఈ విష్యం ఊర్లో అందరికీ తెలిసింది. అమ్మాయి ఇలవరసన్ తో అత్తగారింటికి అయిన నాదంకాలనీ కి వచ్చింది . ఇది తెల్సి దివ్య తల్లి తెన్మోజి కొంత మందిని వెంట పెట్టుకొని దివ్య తో మాట్లాడడానికి వెళ్ళింది. కానీ దివ్య తల్లితో వాళ్ళు రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నట్లు ఇద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు తన తల్లితో ఇక నన్ను మర్చి పో, నన్నువాళ్ళు బాగానే చూసుకుంటున్నారు అని తెగేసి చెప్పింది. ఈ విష్యం తెలిసిన దివ్య తండ్రి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళు అక్కడ ఉండగానే ఆ మరణవార్త దానవాలంగా వ్యాపించింది.

 Gurram Seetharamulu: ManuVu is still alive

అంతకు ముందే వన్నియార్ కుల సంగం ఈ పెళ్లి విష్యం లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని ఇలవరసన్ కుటుంబానికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది . అంతే కాకుండా వన్నియార్ కుల పెద్దలు పిఎంకె పార్టీ ఆధ్వర్యం లో వన్నియార్ అమ్మాయిల వెంట చూసినా మాట్లాడినా పెళ్లి చేసుకున్నా చంపేస్తాం అనే బెదిరింపులు సాక్షాతూ ఒక శాసన సభ సభ్యుడు వేలాది మంది గుమికూడిన బహిరంగ సభలో అనడం మరీ వివాదమయింది . చొక్కా ప్యాంటు వేసుకొని రంగు రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని పనీ పాటు లేకుండా జులాయుల్లా వన్నియార్ అమ్మయుల వెంట పడితే క్షమించేది లేదని ఇక నుంచి మా పార్టీ ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతది అనే దాకా పోయింది ఇంతటి తో ఆగక ఆ పార్టీ వేలాది మందితో సమావేశాలు పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేసి మరింత జటిలం చేసారు . ఇదంతా వాళ్ళ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి ఈ ప్రేమ పెళ్లి ఒక సాకుగా మార్చుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి వందలాది మంది ఆస్తులను బుగ్గి చేసారు.

పిఎంకె పెట్టిన చిచ్చు

ఆలా దివ్య తండ్రి నాగరాజు శవాన్ని మంచం లో పెట్టి జాతీయ రహదారి కి అడ్డంగా పెట్టి రోడ్ మీద చెట్లు నరికి వేసి రహదారిని దిగ్బ్నాధం చేసి వందలాది మంది నాదంకాలనీ, అన్ననగర్, తో బాటు సమీప మరో గ్రామాన్ని సర్వనాశనం చేసారు. జరిగిన దాడిలో వందల ఇల్లు ద్వంశం అయినవి, ఎన్నో కుటుంబాలు నష్ట పోయినవి. దాదాపు ఏడు కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగింది అంటే ఈ దాడి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు . జరిగిన భయంకరమయిన దాడి ఒక సాధారణ ఘటన గా తీసి పారేయలేమనాడు వన్నియార్ కులస్తులు విచ్చుకత్తుల తో చేసిన స్వైర విహారం చేయగా కాలం చెక్కిళ్ళ మీద కన్నీటి చుక్కలు రాల్చిన రోజు. కులం తన విశృంఖల స్వభావాన్ని చూపించిన రోజు. ఏ నేరం చేసారని అలా వందలాది దళితుల ఇల్లు మసి బొగ్గులు గా మార్చారు? ఓనాడు పుట్టిన కులం నిషిద్దం. నేడు ఆ కులానికి ప్రేమ నిషిద్దం. ఇలా వెలి ప్రేమలు వెక్కిరింతలకు నిత్యం గురి అవుతూనే ఉన్నాయి. కులం కాని వాణ్ణి ప్రేమించిన నేరానికి జరిగిన శిక్ష అది వాళ్ళు చేసిన నేరం సమాజ కుల గోడలను బద్దలు కొట్టి ఒక్కటిగా బ్రతకాలనుకున్నారు అంతే. అక్కడ మనువాదం స్వైర విహారం చేసింది. అరవై ఆరేళ్ళ స్వతంత్ర దేశం లో కులం కానివాణ్ణి పెళ్లాడితే రక్షణ ఇవ్వలేని వ్యవస్థ మనది. కేవలం ఈ దాడి ఆ రెండు కుటుంబాలు మధ్య జరిగిన ప్రేమ వివాహం వళ్ళ జరగలేదు . కుల పునాదుల మీద రాజకీయ సౌధం నిర్మించుకున్న పట్టాలి మక్కల్ కట్చి (PMK) దాని వ్యవస్థాపకుడు రామదాస్. తన రక్త దాహం తీర్చు కోవడానికి ఈ ప్రేమ పెళ్లి ఒక సాకు మాత్రమె.

ఇక పోతే ఈ ప్రేమ పెళ్లి వెనక ఇంకో ఆసక్తికరమయిన కోణం కూడా ఉంది. ఆ ఊరిలో వన్నియార్ , పరియా కులాల మధ్య కొన్ని వందల ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి కానీ ,ఇంత తీవ్రమయిన దాడి జరగలేదు. కానీ సాక్షాత్తూ ఒక పార్టీ వ్యవస్థాపక నాయకుడు జోక్యం చేసుకోవడం రెచ్చగొట్టడం మూలాన ఒక్క నాదం గ్రామం లోనే 16౦ ఇళ్ళను పెట్రోల్ పోసి తగల బెట్టారు. మొదట దొరికిందల్లా దోచుకున్నారు. ఆ తర్వాత కనిపించిందల్లా తగలబెట్టారు. రేషన్ కార్డులు, మార్కుల సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు... మొదలైన పత్రాలను వెతికి కుప్పపోసి తగలబెట్టారు. టి.వి, ఫ్రిజ్, మిక్సీ, టూ వీలర్, ఫోర్ వీలర్... ఇలా దళితుల ఆర్ధిక ఉన్నతికి దర్పణంగా నిలిచిన గృహోపకరణాలను టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేశారు. ప్రతి ఇల్లూ తగలబెట్టారు. ఆ ఊరి లో జయరాం అనే అతని ఇంటి మీద మూకుమ్మడిగా రెండు వందల మంది దాడి చేసి పదిహేను తులాల బంగారం తో బాటు కొత్తగా ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రెండు లక్షల రూపాయలు తో బాటు మోతంగా 12 లక్షల నష్టం చేసారు అంటే దాడి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

అదే ఊరిలో విప్లవ రాజకీయాలతో సంబంధాలున్నాయనే సాకుతో 2006 లో పోటా చట్టం కింద అరెస్టు కాబడిన పలనిస్వామి ఇంటినీ తగల బెట్టారు. అన్ననగర్ లో ఇలవరసన్ మామ అయిన జోసెఫ్ ఇంటిని గ్యాస్ సిలిండర్‌తో పేల్చి వేసారు. దాని పక్కనే ఉన్న కొడంపట్టాయ్ గ్రామంలో ఉన్న రెండు వందల ఇల్లు పెట్రోల్ పోసి తగల బెట్టి ద్వంసం చేసారు. ఇది పబ్లిక్ గా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరం. సమీపంలో నాల్గు కిలోమీటర్ల దూరం లో కృష్ణపట్నం పోలీసు స్టేషన్ కూడా ఉన్నా రక్షణ కల్పించక పోగా పారి పోయి ప్రాణాలు దక్కించుకొండి అనడం సిగ్గు చేటు. దాడి జరిగిన తర్వాత రాత్రి పోలీసులు ఊరికి చేరుకున్నారు. కంటి తుడుపు చర్యలు మొదలెట్టారు. ఇక రాజకీయ నాయకుల సరే సరే నామ మాత్రపు పరిహారం ఇప్పించి ఇది రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న సంఘటన అని కుదించే ప్రయత్నం చేసారు. ఈ సంఘటన దళితుల బద్రత మీద మనవ హక్కుల మీద జరిగిన భయంకరమైన దాడి .

పోయిన డిసెంబర్ నెలలో ప్రొఫసర్ ఆనంద్ తెల్ తుంబే అధ్వర్యం లో కొన్ని హక్కుల, కుల సంఘాల నిజ నిర్దారణ కమిటీ పలు ఆశక్తి కరమయిన విషయాలు వెలుగు తీసింది. ఇక పోతే ఈ గృహ దహనాలకు దాడులకు గురి కాబడిన నాయకన్ కోట్టాయి డెబ్బై ఎనభవ దశకం లోతమిళ నాడు ధర్మపురి గ్రామీణ ప్రాంతం లో విప్లవ రాజకీయాలకు బీజాలు వేసిన కామ్రేడ్ అప్పు, అమరుడు బాలన్ వేసిన పునాదులు ఉన్నాయి. ఆనాడు వాళ్ళిద్దరూ ఆ ప్రాంతాలను చైతన్య పరిచారు. అక్కడ జరుగుతున్న ఎన్నో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరచారు. కొంత కాలానికి పోలీసుల దుర్మార్గానికి వాళ్ళిద్దరూ అమరులయ్యారు. ఇప్పుడు ధర్మపురి సెంటర్ లో వాళ్ళ స్మారక స్థూపం ఒక్కప్పటి చైతన్యానికి సాక్షి గా ఉంది. ఆ ప్రాంతం లో ఇప్పుడు కులం రంకెలు వేసి దళితుల మీద లూటీలు దాహనాల కు గురి అవుతున్నవి. ఆ పల్లెలు నేడు కుల కుమ్ములాటలో కునారిల్లు తున్నాయి. ఆ నాటి చైతన్యం స్ఫూర్తి ఆ దళితుల్లో ఆత్మాగౌరవాన్ని నింపింది అక్కడ నేడు చాలా మంది మంచిగా బ్రతుకుతున్నారు నగరాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతున్నారు .ప్రతి ఇంట్లో చదువుకున్న వాడు ఉన్నాడు . అలా వాళ్ళు నగరాలకు వెళ్లి నాలుగు పైసలు సంపాదించడం అక్కడి భూస్వామ్య కులమయిన వన్నియార్‌లకు నచ్చలేదు. అందునా వాళ్ళ ఆడపిల్లలను దళితులు కన్నెత్తి చూడడం, ప్రేమ పెళ్లి చేసుకోవడం అసలే నచ్చలేదు. ఇదో విచిత్ర మయిన సందర్భం.

ఆ ఊరు అలా ఎందుకు...

వన్నియార్ అమ్మాయిలు దళితులనే ఎందుకు చేసుకుంటున్నారో అక్కడి పెద్దలకు ఆందోళన కలిగించింది. తమ కులం జాతి వర్ణ సంకరణం అవడం వాళ్లకు నచ్చలేదు దానికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి ఆముగింపు దివ్య , ఇలవరసన్ పెళ్ళితో పరాకాస్టకు చేరింది. ఒక పెద్ద దాడికి పునాదులు వేసారు ఒక పెద్ద ఉత్పాతం కలిగించి అయినా ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు కట్ట వేయాలనుకున్నారు . ఇది ఇరవై ఏళ్ళుగా నలుగుతున్న వైరం . ఆ వైరానికి అడ్డుకట్ట వేసింది అక్కడ ఉన్న పార్టీ . అలా 1987 లో చిన్నతంబి అనే ఒక దళితుడు వన్నియార్ కులం అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుంటే వాళ్ళను విడదీయాలని ఎన్నో గొడవలు చేస్తే అక్కడ ఉన్న పార్టీ జోక్యం చేసుకొని వాళ్ళకు రక్షణ ఇచ్చిన విష్యం ఇప్పటికీ చెప్పు కుంటారు. ఇవ్వాళ అప్పు - బాలన్ నడిపిన రాజకీయాలు వాళ్ళు ఇచ్చిన ఆత్మా గౌరవ స్ఫూర్తి లేదక్కడ. కులం జడలు విప్పి కులసంగాలు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్ల సీట్ల రాజకీయం లో తాకట్టు పెట్ట బడుతోంది .ఏ లక్ష్యం కోసం అప్పు బాలన్ స్మారక స్థూపం కట్టారో ఆ స్థూపం సాక్షిగా మీటింగ్ జరిపి వందల దళిత కుటుంబాలను అగ్గి పాలు జేశారు.

‘అమరులు ‘అప్పు - బాలన్'లు ఉంటె మా మీద ఇలా దాడులు జరిగేవా' అనే మాటలు నిజ నిర్దారణ సమయం లో వినిపించడం యాదృచ్చికం కాదు. వాళ్ళను తలచుకోవడం అంటే గతించిన ఒక శకాన్ని ముందేసుకోవడం. ఒక మానవీయ విలువల కోసం వాళ్ళు చేసిన ఒక ప్రతిఘటన పోరాటం, ఒక స్ఫూర్తి , ఒక భరోసా , ఒక ఆలంబన. మాకు ఏమన్నా జరిగితే మాకు ‘వాళ్ళు' ఉన్నారు అనే స్థైర్యం. ఇప్పుడు అక్కడ మనువు నగ్నంగా నర్తిస్తున్నాడు విషపు నాగుల కోరలు బుస కొడుతున్నాయి.

రాష్ట్రం లో పాలక వర్గం మారినప్పుడల్లా హింస ఒక కులం నుండి మరో కులానికి మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చుండూరు, కారంచేడు, లక్షిమ్ పేట ఉదంతం ద్వారా కమ్మలు, కాపులు, రెడ్లు పాలక వర్గంగా ఉన్నప్పుడు జరిగిన జరుగుతోన్న హింసను చూస్తున్నాం. విచారం ఏంటంటే ఇక్కడ ఎవడు ఏలుబాటులో ఉన్నా బలయ్యేది దళితుడే. అది భూమి కోసం. కులం, రాజకీయం, ప్రేమ - ఏమన్నా కానీయండి బలయ్యేది కేవలం దళితుడే. ఒక దగ్గర దళితులు భూమి అడిగితే చంపారు , ప్రేమిస్తే చంపారు, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడితే నరికి చంపారు. ఇక్కడ చావు ఒక సర్వనామం .

తమిళనాడు లో దళితుల మీద దాడులు కొత్త కాదు కీలవెన్మని(1968) లో కూలీ పెంచమని పోరాటం చేసిన 44 మందిని సజీవ దహనం చేసిన నెత్తుటితడి సాక్షిగా, చుండూరు, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మ సముద్రం నుండి వేంపెంట దాకా నిన్న గాక మిన్న నెత్తుటి తడి ఆరని లక్షింపేట దాకా వందలు వేలు కుల దాష్టీకానికి బలి అవుతూనే ఉన్నారు. అందులో ఈ ప్రేమ వివాహం ఒక చిన్న సంఘటన మాత్రమే.

దివ్య ఎందుకు వదిలింది...

ఇంతకి దివ్య ఇలవరసన్‌ను ఎందుకు విడిచి పెట్టింది అనేది జవాబు లేని ప్రశ్న. బహుశా తండ్రి ఆత్మహత్య, కుల పెద్దల నిర్వాకం ఆ అమాయకురాలిని దారీ తెన్నూ లేకుండా చేసింది ఉండొచ్చు. ఒంటరి తల్లిని ఒదార్చాలనుకుందో, రెండు కుటుంబాలను కలపాలనుకుందో, కట్టుకున్నవాడికి తెలియకుండా అమ్మను చూడాలని ఇంటికి వెళ్ళింది . మాటు వేసిన కుల అహంకారం ఆ అమ్మయి మనస్సులో చిచ్చు పెట్టింది. విడాకుల కోసం కోర్టులో కేసు వేసే దాకా పోయింది. మద్రాస్ హైకోర్టు చుట్టూ ఈ అమాయక ప్రేమ రక రకాలుగా తిరగింది. ఒక రోజు జుడ్జి తో నను మా అమ్మ నా భర్తను అంగీకరించిన్దాకా ఆగుతా అన్నది. మరో రోజు కొన్నాళ్ళు మా అమ్మకు తోడుగా ఉంటా అన్నది. చివరకు ఇక నేను మా అమ్మతోనే శాశ్వతంగా ఉంటా అని తెగేసి చెప్పింది. ఈ వార్త విన్న ఇలవరసన్ ను కుంగదీసింది .

కోర్టులో దివ్య చేసిన ప్రకటన విన్న ఇలావరసన్ రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నాడు. చని పోవడానికి ముందు తన ప్రియురాలితో మాట్లాడినట్లు, తను చనిపోతున్నట్లు చెప్పినట్లు వార్తలు. గత కాలపు ప్రేమ స్మృతులు దివ్య రాసిన మూడు ఉత్తరాలు తన పక్కనే ఉంచుకొని లోకం నుండి నిష్క్రమించాడు ఇలవరసన్. ఇంకా చెప్పాలంటే కులం కాని పెళ్లి చేసుకుంటే ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది అని స్మశానానికి సాగనంపారు. ఇప్పుడు ఇలావరసన్ ను ఎవరన్నా చంపారా తానె చనిపోయాడా కాలం తక్కెడలో మినుక్కు మినుక్కు మంటోంది. ఏది ఏమయినా అది ముమ్మాటికి హత్యే, సామూహికంగా కలిపి చేసిన హననం అది.

కోటి ఆశలతో ఒక్కటయిన జంట ఇలా కనుమరుగు అయింది. కలల లోకంలో విహరించాలనుకున్న జంటను రాకాసి మేఘం కమ్మేసింది. వాళ్ళ ఊహల్లో ఉస్సస్సులు నింపాల్సిన వాళ్ళు ఉరేసి కాటికి సాగనంపారు . ఇక్కడ దళితుడిగా పుట్టడం నేరం పుట్టినా తనదికాని కులంలో అమ్మాయి వంక కన్నెత్తి చూడడం నేరం. దానికి పరాకాష్ట ఇది. అంతే ఈ దేశం లో దళితులకు బహుజనులకు స్థానం లేదు ‘మనకో దేశం అవసరం' అని ఆనాడు పెరియార్ చేసిన ప్రభోదం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైల్వే ట్రాక్ మీద చిద్ర మయిన దేహం చూసిన ఇలవరసన్ తల్లి తండ్రి రోదనలు అదుపు చేయలేక పోయారు.

చని పోవడానికి కొన్ని రోజుల ముందు ఇలవరసన్ ఒక పత్రికా విలేకరితో "నేను దివ్య తో ప్రేమలో పడ్డాకే కులం ఎంత క్రూర మయినదో అర్ధమయింది, దివ్య నన్ను ఒదిలి ఒక్క వారం కూడా ఉండలేదు "నువ్వు లేకుండా ఒక్క గంట కూడా బతక లేను చావు అయినా బ్రతుకు అయినా నీతోనే అనేది" మా మధ్య చిచ్చులు పెటింది ఒక ‘కుల'పార్టీ ఆ పార్టీకి మేము కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇంకో నెలలో నాకు ఉద్యోగం వస్తది అది వాళ్ళకు ఇష్టం లేదు నా మీద హత్యా యత్నం కేసులు పెట్టి ఉద్యోగం రాకుండా చేసారు. నేను ఈ కులం లో పుట్టడమే వాళ్ళకు సమస్య అని దీనంగా అన్నాడు. ఒక కట్టుకథ అతన్ని కాటేసి విగత జీవిని చేసింది .

ధర్మపురి హాస్పిటల్ మార్చురీ లో నిత్యం శవాలతో సహజీవనం చేసే ఇలవరసన్ తండ్రి ఇలంగో గడిచిన మూడు దశాబ్దాలుగా అక్కడ ఉద్యోగి . ఎన్నో చిద్రమయిన శవాలకు పోస్ట్ మార్టం చేసి ఉంటాడు. కానీ కన్న కొడుక్కి ఈ రోజు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు అతనికి తెలుసు కోర్టులు చట్టాలు అతనికి న్యాయం చేయవని, అంతెందుకు కోర్టుకు పోయినా కేసు తన కొడుకు శవం మీద పెట్టిన ఐసు గడ్డ కరిగినంత సేపు కూడా నిలవడదని. అందుకే ఇలంగో మార్చురీ ముందు అచేతనంగా దీనంగా శూన్యం లోకి చూస్తూ ఉన్నాడు. కాలం కసాయి తనానికి బలి అయిన తన కొడుకు జ్ఞాపకాలు నేమరేసుకుంటున్నాడు. విగత జీవిగా మారిన ఒక విషాద ప్రేమ కావ్యానికి వీడ్కోలు పలుకుతున్నాడు. చావు అంటే ఒక అంకె మన నుండి మాయం కావడం కాదుగా , దానితో పెన వేసుకున్న రక్త మాంసాల కలబోతగా. అవును ఇలవరసన్ ఇప్పుడు గతం చరిత్రలో నెత్తుటి మరక. కాన రాని కొడుకు చరిత్రను శూన్యం లో రాస్తున్నాడు. అంతే కళ్యాణ రావు అన్నట్లు ‘ఇప్పుడు పుట్టిన కులం నమ్మిన ఆదర్శం అన్నీ నిషేదమే' నేడు ఇలవరసన్ ప్రేమ ఒక వెలి ప్రేమ ఒక అంటరాని ప్రేమ అంతే ఏమీ మారలే. మనువు క్షేమంగానే ఉన్నాడు.

- గుర్రం సీతారాములు

English summary
Gurram Seetharamulu, research scholar at EFLU writes about the sad story of Dalith Ilavarasan and Divya love story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X