చింతపట్ల క్విక్ బాక్సింగ్:‘ఒన్ టూ బక్‌ల్ మై షూ’
అదో గాడిద. గాడిదంటే గాడిదే! దేనికి వెనక వైపు నించుంటే డేంజరే అదే గాడిద. పేపర్ వెయిట్‌ల లాంటి పెద్ద గాజు కళ్లు అరగజం దాటని తోకా, బలంగా తన్న గలిగే వెనక్కాళ్లూ దాని సొంతం. అది మామూలు గాడిదేం కాదు. తెలివైన గాడిద. ఎంత తెలివైన గాడిదంటే మనుషులకంటే తెలివైన గాడిద.
ఇదో కుక్క. కుక్కంటే కుక్కే! ఏది మొరక్కుండా చప్పున పిక్కందుకోగలదో అదే కుక్క. ఏ చిన్న చప్పుడుకైనా అటెంచన్‌గా నిలబడే చెవులూ, అంతెత్తున లేచినలబడే తోకా, ఇట్టే ఏ వాసన్నయినా పసిగట్టే ముక్కూ దాని సొంతం. అది మామూలు కుక్కుం కాదు. తెలివైన కుక్క. ఎంత తెలివైన కుక్కంటే మనుషులకంటే తెలివైన కుక్క.
అదో తెలివైన గాడిదా ఇదో తెలివైన కుక్కా రెండూ ఫ్రెండ్సే. పొద్దు మూకుతా వీధుల్లో పడి తిరుగుతుంటయి రెండూ. యజమాని అవసరం తీరాక వదిలేసిన గాడిద, యజమాని అవసరం లేక వదిలేసిన కుక్క దేవుడే యిచ్చాడు వీధి ఒక్కటి అనుకుంటూ తిండీ నీళ్లూ వెదుక్కుంటూ తిరుగుతాయి.
గాడిదకు కాగితాలంటే యిష్టం. పేపర్లంటే యిష్టం అయిన గాడిదకు పేపర్లల్లో వుండే వార్తాలంటే మరీ ఇష్టం. అవి పొట్ట నిండా నింపుకుని వాటి మీద చర్చించడం మరి మరి ఇష్టం. అది ‘వెజిటేరియన్ను'.
కుక్కకి మాంసం అంటే యిష్టం. మాంసం అంటుకుని వుండే ఎముకలంటే యిష్టం. మాంసం మొత్తం అయిపోయినా ఎముకని పట్టుకుని మళ్లీ మళ్లీ నవలడం మరి మరి ఇష్టం. ఇది పక్కా ‘నాన్ వెజిటేరియన్ను'.

అదో వెజిటేరియన్ గాడిదా ఇదో నాన్ వెజిటేరియన్ కుక్కా పొద్దు గూకుతా ‘ఎవరికి వారే యమునా తీరేగా' తిరిగినప్పటికీ పొద్దుమూకేటప్పటికి ఊరి చివర పాడుబడ్డ కొంప అరుగుమీద ‘మీట'వుతయి. ఒక దాని కొకటి ‘గుడీవినింగ్' చెప్పుకుంటయి. ఆ తర్వాత కబుర్లు చెప్పుకుని బాగా చీకటి పడ్డాక ‘గుడ్‌నైట్ ' చెప్పుకుంటయి. ఉదయాన్నే లేచాక గుడ్ డే చెప్పుకుని దేని దారిన అది వెళ్లపోతయి.
పొద్దున్నంతా వార్తలూ, వింతలూ విశేషాలూ నమిలేసిన గాడిద పొట్టనిండా వాటితో అరుగెక్కిన గాడిద తాపీగా ఒక్కో వార్తనీ కుక్కకి తెలియజేస్తుంది. తెలివైన గాడిద కనుక వార్త వెంట వ్యాఖ్య కూడా చేస్తుంది. అది చెప్పే విషయాలు వినే కుక్క మామూలుదేల కాదు కదా! అదీ విన్న సంగతుల మీద తన ‘ఓపీనియన్లు' చెబుతుంది. ఆ రెండింటి మధ్యా ‘ఫ్రెండ్లీ డిస్కషన్లు' జరుగుతయి. టీవీ చర్చల్లా గలాటా వుండదు. పద్ధతిగా జరిగే ఈ చర్చల సంగతి. అసలు ఓ తెలివైన గాడిదా, ఓ తెలివైన కుక్కా ఇట్లా కాంటెంపరరీ పాలిటిక్స్ మీద తమ విజన్‌ను వినిపిస్తున్నాయన్న సంగతి ఛానళ్లకు తెలీదు. తెలిస్తే ‘లైవ్' ప్రసారాలు చెయ్యడానికి పోటీ పడ్తయెమో! నిష్పక్షపాతంగా చర్చలు జరిపే ‘టాలెంట్' మనుషులకంటే గాడిదకూ, కుక్కకూ వున్నయని ముక్కుల మీద వేళ్లేసుకుంటరేమో! రోజూ సాయంత్రం కలుసుకునే గాడిదా, కుక్కా చెప్పుకునే కబుర్లని నాకు తీరిక వున్నప్పుడూ, నేనూ వినడం జరిగినప్పుడూ మీకూ అందిస్తుంటాను. ఆలకించండి.
ఎప్పటిలాగానే అరుగు మీదకు వచ్చింది గాడిద బరువెక్కిన పొట్టతో. అప్పటికే అరుగు మీదకు చేరుకున్న కుక్క ఎముక నోదాన్ని నమిలిందే నముల్తూ అదో పనిగా నముల్తావున్నది.
అరుగెక్కిన గాడిదకు ఎన్నడూ లేంది అరుగుమీద ఒకటి కాదు రెండు కుక్కలు కనిపించేయి. ఇదేమిటీ ‘ఏలియన్ డాగ్' ఎక్కడిదని కొంపదీసి తన కాలిపిక్కకు లైనేయదు కదా అని భయపడింది గాడిద.
‘గుడ్ ఈవినింగ్ డాగీ హౌ ఆర్ యూ' అంది గాడిద.
నముల్తున్న ఎముకని వదిలి ‘అయామ్ ఫైన్ ఎండ్ యూ' అంది కుక్క.
‘థాంక్యూ'. మరా రెండో కుక్కనీ పక్కన వుందే అదెవరు? అంది గాడిద.
చుట్టూ చూసింది కుక్క. ఎవరూ అవుపడ్లా. ఈ అరుగుమీద అలవాటుగా కల్సుకునే తనూ గాడిదా తప్ప మూడో ప్రాణం ఏదీ లేదే అనుకుంది. ఆ మాటే అంది.
అరే! మరి నాకు రెండు డాగీలు కనిపిస్తున్నాయే! అసలు ఈ వేళ నా ‘ఐ సైట్'కేదో అయింది. ఒక్క పేపర్ తింటే రెండు పేపర్లు తిన్నట్టుంది. ఒక్క శాల్తీని చూస్తే రెండు శాల్తీలుగా కనపడ్తున్నవి. నేలలు రెండు ఆకాశాలు రెండు సూర్యుళ్లు రెండు చంద్రుళ్లు రెండు.. అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నయి.. అంది గాడిద పేపర్ వెయిట్ కనుగుడ్లను గుండ్రంగా గుండ్రంగా తిప్పుకుచూస్తూ.
ఫక్కుమంది కుక్క. డోంట్ వర్రీ నో ప్రాబ్లమ్. ఒకటిని రెండుగా విభజించినప్పుడు, ఒకటిగా ఒక్కటిగా ఎలా కనిపిస్తుంది. రెండుగానే అవుపిస్తుంది. రెండు అయిన రెండు రెండుగానే కనిపిస్తుంది కానీ ఎప్పటికీ ఒక్కటిగా కనిపించనే కనిపించదు అంది.
అవును కదూ! అదీ సంగతి! అయామ్ ఆల్ రైటన్న మాట అన్నది గాడిద తోకని కాళ్ల సందున ఇరికించుకుని రిలాక్సయి చంద్రుళ్లు ఇద్దరయినా ఆకాశం ఒక్కటే కదా. ఒక్కటి వేరయి రెండుగా మారినా ఒక్కటిగా ఆలోచించ రాదా అంది.
‘కొత్త బిచ్చం పొద్దెరుగదు' అన్నట్టు ఏదో వేరుపడ్డాం కదా అని వేరే వేరేగా ‘థింకు' చేస్తున్నారు. వేరు పడ్డప్పటికీ ఉమ్మడి సమస్యలు ఎన్నో వున్నయని వాటిని ‘సాల్వు' చెయ్యడానికి ఒక్కటిగా ఆలోచించాలనీ వీళ్లకి ఎవరు చెప్పాలి అన్నది డాగీ ఒళ్లు విరుచుకుంటూ.
మొన్నటికి మొన్న ఇసుక మాఫియానో, అధికారుల నిర్లక్ష్యం కారణంగానో, ప్రభుత్వ అలసత్వం వల్లనో ముక్కు పచ్చలారని పిల్లలు తలితండ్రులకి డెత్ సర్టిఫికెట్లు అందించి నీరయి పోయేరు అన్నది గాడిద డగ్గుత్తికతో.
నిన్నటికి నిన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో ఎవరికి ఎవరు దిక్కో దివాణమో తెలియని విద్యార్థులూ, పేరెంట్సూ తలలు పట్టుకుంటున్నారు అని నిన్న రాత్రి చెప్పావుగా అంది డీవోజీ.
అవును. ఇలాంటివే అనేక సమస్యలు ఒకటి రెండయినా రెండు ఒకటయి చూడాల్సినవి. కానీ మనవాళ్లు ‘అత్త మీద కోపం వచ్చి అల్లుడు పెళ్లాం కాళ్లని పొయ్యిలో పెట్టినట్టు' చేస్తున్నారు అంది ఏయస్‌యస్.
కాదా మరి. ఓట్లూ సీట్లూ గెల్చుకోడానికి ‘సూదిలో దారం సందులో బేరం' అన్నట్టు అలవికాని హామీలు గుప్పించి ఇప్పుడు మీకు మీరే మాకు మేమే అంటున్నారు అంది గాడిద ఆవలిస్తూ నిద్రలోకి జారిపోతూ.
ఒక్కటి రెండయినా రెండు ఒక్కటిగా ఆలోచిస్తే తప్ప ఒక్కటి రెండుగా రెండూ లాభంగా క్షేమంగా వుండగలదా అన్నది కుక్క ఆవలించకుండానే జారిపోతూ నిద్రలోకి.
-చింతపట్ల సుదర్శన్












Click it and Unblock the Notifications