వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికి వారే....

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భద్రతా ఏర్పాట్ల విషయంలో అధికారుల మధ్య సమన్వయ, సమాచార వినిమయ లోపాలు కొట్టొచ్చినట్లు బయటపడ్డాయి. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై గత నెల 1వ తేదీన నక్సలైట్ల దాడికి దారి తీసిన భద్రతా వైఫల్యాలపై ప్రకాశ్‌ సింగ్‌ కమీషన్‌ రాష్ట్ర ఉన్నతాధికారులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా కమీషన్‌ ముందు రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పిన విషయాలు ఆ లోపాలను స్పష్టంగా బయటపెడుతున్నాయి.

మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రకాశ్‌సింగ్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ పనిని ఆయన హైదరాబాద్‌లో బుధవారం ముగించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. ఐజిపి (భద్రత) సుదీప్‌ లకటకియా, ఐజిపి (గ్రేహౌండ్స్‌) అనురాగ్‌ శర్మ, ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కె. ఉమాపతి, మాజీ చిత్తూరు ఎస్‌పి ఎన్‌. నవీన్‌చంద్‌ (ఈయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది), అనంతపురం మాజీ డిఐజి ఎ.వి. నారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అజయ్‌ కలామ్‌, చిత్తూరు కలెక్టర్‌ జి. సాయిప్రసాద్‌ (ఈయనను ప్రభుత్వం ఎపిట్రాన్స్‌కోకు బదిలీ చేసింది), తదితర అధికారులు ప్రకావ్‌సింగ్‌ కమీషన్‌ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు.

అడ్వాన్స్‌ సెక్యూరిటీ లాయజనింగ్‌ (ఎఎస్‌ఎల్‌) గురించి కలెక్టర్‌కు ఎందుకు తెలియజేయలేదని ప్రకాశ్‌ సింగ్‌ నవీన్‌చంద్‌ను ప్రశ్నించారు. ఇది తీవ్రమైన లోపమని ఆయన అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌కు తాను తెలియజేయని మాట వాస్తవమేనని నవీన్‌చంద్‌ అంగీకరించారు. అయితే తనిఖీ నిర్వహణకు సంబంధించిన చొరవ కలెక్టర్‌ స్వయంగా చూపాలని ఆయన చెప్పారు. ఘాట్‌ రోడ్డుపై కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించే పనిని తాను తిరుపతి రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణయ్యకు అప్పగించానని అదనపు ఎస్‌పి ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పారు.

అధికారుల వాదనలు చూస్తుంటే భద్రతా చర్యలను చేపట్టడంలో వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుంది. ఎవరికి వారు ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నాలకు పాల్పడినట్లు అర్థమవుతున్నది. మొత్తం సమన్వయలోపం ఎంత దారుణంగా ఉందో వెలుగు చూసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X