స్నేహ ధర్మానికి ప్రతీక కెవిపి

అనేక ధర్మాలతో పాటు స్నేహ ధర్మానికి మన పౌరాణిక ఇతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ స్పీడు యుగంలో "స్నేహ బంధము, ఎంత మధురము" అనుకుంటూ దశాబ్దాల తరబడి ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా నేస్తానికి అన్ని సంగతులు చెప్పుకునే వారు చాలా అరుదు. రాజకీయ నాయకుల్లో అయితే అది మహా అరుదు. కానీ కెవిపికి, వైఎస్ కు మధ్య ఉన్న స్నేహ బంధం ఎంతో సమున్నతమైనదనే చెప్పాలి. ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసి మూడు దశాబ్దాలకు పైగా మంచి స్నేహితులుగా జీవితంలోని అనేక తీపి, చేదు అనుభూతులను పంచుకుంటున్న ఈ ఇద్దరు మిత్రుల కథ నిస్సందేహంగా చరిత్రలో నిలిచిపోగలదు.
కెవిపి పూర్తి పేరు కోటగిరి వెంకట ప్రభాకర రామచంద్రరావు. కృష్ణాజిల్లా బావులపాడు మండలం అంబాపురం గ్రామంలో సంపన్న వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. విజయవాడలో పియుసి, గుల్బర్గాలో ఎంబిబిఎస్ చదివారు. గుల్బర్గా మెడికల్ కళాశాలలో ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డికి జూనియర్ . మూడున్నర దశాబ్దాల క్రితం వారి మధ్య స్నేహం ఏర్పడి, ఇప్పటి వరకు ఆత్మలో ఆత్మగా కొనసాగుతున్నారు. ఎంబిబిఎస్ చేసినా కెవిపి ఏనాడూ డాక్టరుగా ప్రాక్టీసు చేయలేదు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకుని ఆయన ఇద్దరు కుమారులను బాగా చదివించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను చేశారు.
వైఎస్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన ఘనత కెవిపిది. 1980 లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. 1983 లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ డైరెక్టర్ గా సేవలు అందించారు. 1978లో వైఎస్ ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత సహాయమంత్రిగా పనిచేయడం తెలిసిందే. కొంతకాలం డాక్టరుగా ప్రాక్టీసు చేసిన తర్వాత గానీ వైఎస్ రాజకీయాల్లోకి రాలేదు. వైఎస్ రాజకీయాల్లో క్రియాశీలమైన నాటి నుంచి కెవిపి ఆయన తలలో నాలుకగా మారారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమైన నిర్ణయాల్లో వైఎస్ ఏనాడూ కెవిపి మాటను జవదాటిపోలేదు. కెవిపి కూడా అనవవసర విషయాల్లో తలదూర్చే రకం కాదు.
ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా చలించని మనస్తత్వం రామచంద్రరావుది. స్నేహ ధర్మంతో తాను చేసే ప్రతి చర్యను భగవంతుడు హర్షిస్తాడని ఆయన విశ్వాసం. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి మంతనాల్లో ఆయన ఎక్కువ సేపు గడుపుతారు. జర్నలిస్టుల మాటల్లోని మర్మాన్ని ఇట్టే గ్రహించి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటారు. ఈ విధమైన శ్రమ వైఎస్ పడకుండా కెవిపి ఆ బాధ్యతను తన మీద వేసుకున్నారు.
మెడికల్ గ్రాడ్యుయేట్ కావడమే కాకుండా వ్యూహ రచనలో, రాజనీతిలో దిట్ట అనిపించుకున్న డాక్టర్ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో లో తన గళం విన్పించి, తన విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటు కుంటారని ఆశించవచ్చు. చివరిగా ఒక మాట. వైఎస్ విజయాల వెనుక రామచంద్రరావు ఉన్నారు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ వెన్నంటి ఉన్న మిత్రుడికి ఎంతో విలువ ఇవ్వండం ద్వారా వైఎస్ తన విలువను ఇంకా పెంచుకున్నారు.












Click it and Unblock the Notifications