వంద టెస్టుల తెలుగువాడు

తన బ్యాటింగ్ శైలితో లక్ష్మణ్ ప్రపంచంలోని క్రికెట్ మేధావులను ఆకట్టుకున్నారు. స్పిన్ ను ఆడడంలో ఆయనను మించినవారు లేరనే మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో ఆయనను మించినవారు లేరు. ఆయన తన రెండు డబుల్ సెంచరీలను ఆస్ట్రేలియాపైనే చేశారు. కోల్ కత్తాలో 2001లో జరిగిన టెస్టు మ్యాచులో 281 పరుగులు చేసి మ్యాచ్ ఫలితాన్నే మార్చివేశాడు.
గాడ్ ఫాదర్స్ లేకపోవడంతో భారత జట్టులో ఆయన స్థానం ఎప్పుడూ స్థిరంగా ఉన్నట్లు కనిపించదు. దాంతో ఎప్పటికప్పుడు తన ప్రతిభను చాటుకుంటూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. 99 టెస్టు మ్యాచుల్లో ఆయన 6313 పరుగులు చేశాడు. లక్ష్మణ్ ను వెరీ వెరీ స్పెషల్ అంటారు. ఆ రకంగా క్రికెట్ వ్యాఖ్యాతల మన్ననలు పొందాడు ఆయన.
లక్ష్మణ్ 1996లో అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించారు. దాంట్లో అతను అర్థ సెంచరీ చేశాడు. అయితే జట్టులో స్థానం కోసం అతను పోరాటమే చేయాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్ లో మేటి బ్యాట్స్ మెన్ ఉండడంతో 1997లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో ఓపెనరుగా దిగాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు అతను ఆ పాత్ర నిర్వహించాడు. ఆ తర్వాత అతను ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. ఈ రకంగా జట్టులో స్థిరమైన చోటు లేకుండా అతను ఇబ్బందులు పడ్డాడు. అయినా మొక్కవోని ధైర్యంతో, స్థిర చిత్తంతో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. అందుకే లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ అయ్యాడు.












Click it and Unblock the Notifications