కెసిఆర్‌కు సవాల్: 250 మంది రైతుల ఆత్మహత్య

విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండడం, వర్షాలు లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యుత్తు కొరతపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు, ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ మంత్రులు కెటి రామారావు, హరీష్ రావు వంటివారు రైతులకు విన్నపాలు చేస్తున్నారు అయినా అవి ఆగడం లేదు. తెలంగాణలో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. వచ్చే మూడేళ్ల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెబుతున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో సగటున రోజుకు ఇద్దరు రైతులు మరణించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ జిల్లాలోనే 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అంచనా. అందులోనూ 18 మంది కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ శాసనసభా నియోజకవర్గంలోనే మరణించారు.
వరంగల్ జిల్లాలో అత్యధికంగా నాలుగు నెలల కాలంలో 54 ఆత్మహత్యలు జరిగాయి. కారణమేదైనాప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పునరావాస సహాయం అందించాలని 2004లో జారీ అయిన జీవో చెబుతోంది. రాష్ట్రంలో రైతులు పూర్తిగా ఆశలు వదులుకున్నారని తెలుగుదేశం తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. నాలుగు నెలల్లో ప్రభుత్వం అద్భుతాలు చేయాలని తాము ఏమీ కోరుకోవడం లేదని, అయితే ఇంతటి విధ్వంసం జరగకుండా చూడాల్సిందని అంటున్నారు. తెలంగాణ టిడిపి నేతలు గురువారంనాడు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాలకు జానా డిమాండ్
ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంలో రైతు సమస్యలపై చర్చించడానికి తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులతో ఎక్కువ శాతం పంటలు ఎండిపోయాయని, దానికితోడు విద్యుత్ కొరతతో మిగిలిన పంటలు చేతికిరాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆత్మస్థైర్యం కోల్పోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిలో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ ఒక్క అంశంపైనే మూడు రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించి, సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. నిజానికి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా వారిలో విశ్వాసం కల్పించకపోతే మరిన్ని ఆత్మహత్యలు చోటుచేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరెంటు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందునే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ మండలి పక్ష ఉప నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ సగటున ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా విషాదకరమని అన్నారు. రైతు సమస్యలపై చర్చించి, పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ ప్రభుత్వానికి రెండు సార్లు లేఖలు రాసినా, ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్కారు చేతగానితనం, వైఫల్యం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications